గత కొంత కాలంగా సినీమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. ఇక డ్రగ్స్ మత్తులో బీటౌన్ మునిగిపోతోంది. ముంబైలో ఎక్కడ దాడులు జరిగినా దాని మూలాలు మాత్రం బాలీవుడ్‌కే వచ్చి చేరుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులు ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ కి సంబంధించిన పలువురు సినీ ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు.. ఇంటరాగేషన్ చేశారు.
ఇక బాలీవుడ్ లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. దీనిపై ఈడీ కొరడా ఝలిపించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై తీరంలోని ఓ ఓడలో జరిగిన రేవ్ పార్టీపై గత అర్ధరాత్రి దాడిచేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ట్స్ కుమారులను కూడా ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఎన్సీబీ అధికారుల అదుపులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం కలకలం రేపుతోంది. అతడిని ఎన్ సీబీ (NCB) అధికారులు విచారిస్తున్నారు.
ముంబై శివారులో క్రూజ్ షిప్ లో ఈ పార్టీ జరగడం విశేషం. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ…సమాచారం రావడంతో శనివారం 2021, అక్టోబర్ 02వ తేదీ శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో చిందులేస్తున్న దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కాసేపట్లో ముంబైకి తీసుకురానున్నారు. ఆదివారం ఉదయం.. వీరిని ముంబైకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ హస్తం లేకపోవచ్చని అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.