లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్న సాయి పల్లవి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బుల్లితెర మీద డ్యాన్స్ షోస్ చేసిన విషయం తెలిసిందే. 2008లో తమిళంలో స్టార్ విజయ్ ఛానల్ లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా?’ అనే డ్యాన్స్ షోలోనూ, 2009లో ఈటీవీలో ప్రసారమైన ఢీ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోస్ లో తనదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో 3వ రన్నరప్ గా నిలిచింది. తమిళ డ్యాన్స్ షోలో అయితే ఫైనల్ వరకూ వెళ్ళి రన్నర్ గా నిలిచింది. డ్యాన్స్ షోస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడింది. దర్శకుల ఉత్తమ ఎంపికగా సాయి పల్లవి పేరు తెచ్చుకుంది.
ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. హీరోయిన్ అయినప్పటికీ డ్యాన్స్ విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్టు పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హీరోలకి పోటీగా డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. అయితే డ్యాన్స్ షోస్ తో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి.. అదే డ్యాన్స్ షోస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. టీవీ డ్యాన్స్ రియాలిటీ షోస్ పై సాయి పల్లవి తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. టీవీ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారని, ప్రముఖుల వారసులకే మర్యాద, గౌరవం దక్కుతాయని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అందుకే తనకు డ్యాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదని, ఈ డ్యాన్స్ షోలు అంటే తనకు అసహ్యమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 2008లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా’ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ సమయంలో ఫైనల్ వరకూ వెళ్లి చివరకు రన్నరప్ గా నిలిచింది. ఈ కారణంగా ఆమె అసహనానికి గురై ఉండవచ్చునన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విన్నర్ అవ్వాల్సిన తనను ప్రముఖుల వారసుల కోసం తొక్కేశారన్న అభిప్రాయంతో ఇలా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.