ప్రముఖ తమిళనటుడు రోబో శంకర్ హోం టూర్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా 5 లక్షల రూపాయలు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హోం టూర్ కారణంగా ఆయన చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకూ ఏం జరిగింది?
ప్రముఖ నటుడు రోబో శంకర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గర అయ్యారు. తమిళ సినిమా ‘మారీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ ప్రముఖ తమిళ మీడియా సంస్థ కొద్దిరోజుల క్రితం రోబో శంకర్‌ను ఇంటర్వ్యూ చేసింది. తర్వాత ఆయన ఇంట్లో టూర్ నిర్వహించింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే అనుకోని సంఘటన జరిగింది. రోబో శంకర్ ఇంట్లో అరుదైన చిలకలు ఉన్నాయని ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
రోబో శంకర్ ఇంట్లో ఉన్న అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే జాతి చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఆ చిలుకలు అంతరిస్తున్న జాతికి చెందినవి కాకపోయినప్పటికి, వాటిని పెంచుకోవటానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి దాదాపు 5 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. సాధారణంగా అటవీ అధికారుల అనుమితి లేకుండా కోతుల్ని పెంచుకోవటం కూడా నేరమే. కొంతమంది యూట్యూబర్స్ కోతుల్ని పెంచుతూ తమ ఛానళ్లను నడిపేవారు. సమాచారం అందుకున్న పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చి, కోతుల్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టారు. రోబో సినిమాతో రోబో శంకర్‌గా మారిపోయారు. మారీ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్నారు. కేవలం కమెడియన్‌గానే కాదు.. ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేస్తూ ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోలు కూడా చేస్తున్నారు. మరి, అటవీ అధికారుల అనుమతి లేకుండా అరుదైన చిలుకల్ని పెంచి ఇబ్బందుల్లో పడ్ద రోబో శంకర్ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.