ఆర్.ఆర్.ఆర్.. ఇండియన్ సినీ బాక్సాఫీస్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.
మొత్తం ఒక నిమిషం నలభై ఎనిమిది సెకండ్స్ నిడివి ఉన్న ఈ వీడియోలో రాజమౌళి తన టీమ్ కష్టాన్ని ప్రేక్షకుల కళ్ళకి కట్టినట్టు చూపించాడు. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ లో మాస్టర్స్ నుండి వస్తున్న సినిమాగా తన ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేసుకున్నాడు. అలాగే ఈ వీడియో ఆసాంతం యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటం విశేషం. ముఖ్యంగా వాటర్, ఫైర్ షాట్స్ ఎక్కువ చూపించారు. ఇవి మూవీ థీమ్ ని రెప్రజెంట్ చేసేలా అనిపించాయి. ఇక హాలీవుడ్ సాంకేతిక నిపుణులకు రాజమౌళి షాట్స్ వివరించే చాలా ఫుటేజ్ ఈ వీడియోలో ఉంది. ఇక ఇదే సమయంలో శ్రియ, అజయ్ దేవగన్, అలియా భట్ లుక్స్ కూడా రివీల్ చేశాడు జక్కన్న.
ఈ మొత్తం ఈ వీడియోకి హైప్ ఇచ్చింది మాత్రం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. తన పంధాని మార్చుకుని బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు సైతం నచ్చేలా కీరవాణి మ్యూజిక్ ఇచ్చాడని ఈ మేకింగ్ వీడియో చూస్తేనే అర్ధం అయిపోతోంది. ఇక రాజమౌళి ఈ వీడియోలో తన హీరోలని చాలా తక్కువ షాట్స్ లో చూపించాడు. వీడియో మొదలయ్యాక 1.06 సెకండ్స్ వద్ద రామ్ చరణ్ రోప్స్ కట్టుకుని గాలిలోకి ఎగసి బాణం వదిలే షాట్ అభిమానులకు ట్రీట్ అందించేలా ఉంది.
ఇక 1.28 సెకండ్స్ వద్ద రాజమౌళి మైక్ లో గో.. గో.. గో.. అని అరుస్తూ ఉంటే.. యంగ్ టైగర్ యన్టీఆర్ పులిలా.. మెరుపు వేగంతో పరిగెత్తే షాట్ మొత్తం వీడియోకే హైలెట్. మరి.. కేవలం ఓకే ఒక్క మేకింగ్ వీడియోతో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి .. రానున్న కాలంలో ఈ మూవీతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి.. ట్రిపిల్ ఆర్ మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.