సీనియర్ నటుడు పీఎల్ నారాయణ నట వారసులు ఎవరు లేరా అంటే.. లేకేం ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన టాప్ హీరోయిన్ ఒకరు ఆయనకు స్వయానా మేనకోడలు. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..
పీఎల్ నారాయణ అంటే టక్కున గుర్తు పట్టడం కష్టం కానీ.. రుద్రవీణ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వ్యక్తిగా, అలానే మయూరి సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన నటుడే పీఎల్ నారాయణ. తండ్రి, తాగుబోతు, అమాయకమైన భర్త, బిక్షగాడు, రాజకీయ నేత.. ఇలా పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి.. దానిలో జీవించడం ఆయనకు మాత్రమే సొంతం. తెలుగు, తమిళ భాషల్లో.. సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి.. టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు పీఎల్ నారాయణ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వాస్తవంగా చెప్పాలంటే.. నారాయణ తెలుగు వ్యక్తి కాదు. మళయాల కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ పుట్టింది మాత్రం.. గుంటూరు జిల్లా, బాపట్ల నగరంలో. నారాయణ బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చదువుకునే రోజుల్లోనే.. ఒంగోలు ప్రజానాట్యమండలిలో చేరి కుక్క అనే నాటకం రాశారు. ఇది మంచి విజయం సాధించడమే కాక.. జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది.. పనిలో పనిగా.. ఈ నాటకం కారణంగా నారాయణకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరి నారాయణ తర్వాత ఆయన కుటుంబం నుంచి ఎవరు సినిమాల్లోకి రాలేదా అంటే.. వచ్చారు. రావడం మాత్రమే కాదు.. కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌ని ఏలింది. నారాయణ మేనకోడలు.. ఊహ. అవును మీరు విన్నదే నిజమే.. శ్రీకాంత్ భార్య.. ఊహ.. నారాయణకు స్వయానా మేనకోడలు. తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఊహ. ఆమె అసలు పేరు శివరంజిని. తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే తమిళంలో హీరోయిన్గా 20 సినిమాల్లో నటించింది. తెలుగులో తొలిసారి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పేరును ఊహగా మార్చాడు ఈవీవీ. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో యాక్ట్ చేసింది.
ఊహ తెలుగులో హీరో శ్రీకాంత్‌తోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఊహ తెలుగులో తొలి, చివరి సినిమా శ్రీకాంత్‌తోనే చేయడం విశేషం. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. ఇక వీరి కుమారుడు రోషన్ హీరోగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ఊహ.. పీఎల్ నారాయణ మేనకోడలు అనే విషయం చాలా మందికి తెలియదు. పీఎల్ నారాయణ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.