మెగా వారసురాలికి క్లీంకార అనే పేరు పెట్టిన సంగతిని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే చరణ్-ఉప్సీల బుజ్జాయికి ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న రీజన్‌ను ఉపాసన తల్లి తాజాగా రివీల్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో స్పీడ్ పెంచారు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు చెర్రీ. ‘రంగస్థలం’తో తనలోని విలక్షణ నటుడ్ని బయటకు తీసిన చెర్రీ.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోమారు నట విశ్వరూపం చూపించారు. బ్రిటిషర్లపై ఉన్న కోపాన్ని, దేశ స్వాతంత్ర్యం కోసం ఫైట్ చేయాలనే తపనను తన క్యారెక్టర్ ద్వారా అద్భుతంగా పలికించారు. దేశం కోసం ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడితో పోరాడే సీన్స్‌లో చరణ్ పలికించిన హావభావాలు ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీ తర్వాత లెజెండ్రీ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో జాయిన్ అయ్యారు చరణ్. సినిమాలతో బిజీగా ఉన్న చెర్రీ ఇంట్లో ఈ ఏడాది పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది.
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ గుడ్ న్యూస్‌తో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. తాజాగా ఆ బుజ్జాయికి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. చరణ్-ఉప్సీల బిడ్డ పేరు క్లీంకార అంటూ రివీల్ చేశారు. చిరు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన పేరెంట్స్ పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన తల్లి శోభన కామినేని ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఉపాసన పుట్టినప్పుడు తనకు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మొత్తానికి ఉప్సీ కూతురుకు ఈ పేరు పెట్టడంతో చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఉపాసన.. లవ్ యూ మామ్ అంటూ తన తల్లికి కృతజ్ఞతలు చెప్పారు.