రామారావు, సావిత్రి అన్న చెల్లెలుగా నటించిన “రక్త సంబంధం” ఓ ఆణిముత్యం. ఈ సినిమాలో ఇద్దరు పోటీ పడి నటించారు. ఇందులోని “చందురుని మించు అందములొలికించు” పాట అద్భుతం. ఈ పాటలో “కంటిలో పాప, ఇంటికే జ్యోతి, చెల్లి నా ప్రాణమే” అంటూ మహానటుడు పాడుతుంటే మహిళల కంట కన్నీరు ఆగలేదు.
మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ సెంటిమెంట్ ని నమ్ముకుని ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా హిట్లర్ చిత్రంలో నటించి విజయం సొంతం చేసుకున్నాడు. ముత్యాలు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ” కన్నీళ్ళకే కన్నీళ్లొచ్చే” పాటతో కన్నీళ్లు తెప్పించాడు.
దర్శకరత్న దాసరి నారాయణ మూర్తి, విప్లవ సినిమాలు తీసే ఆర్.నారాయణ మూర్తి కలిసి మనకు అందించిన అపురూప చిత్రం ఒరేయ్ రిక్షా. ఇందులో “మల్లె తీగకు పందిరి ఓలే .. మసక చీకటిలో వెన్నెల ఓలే .. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా. తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా ” పాట ఆ యేడాది మొత్తం మారుమోగింది. ఇప్పటికీ వందేమాతరం శ్రీనివాస్ కనిపిస్తే ఎంతో మంది ఈ పాట పాడమని అడుగుతుంటారు.
జగపతిబబాబు సినిమా శివరామరాజు 2002లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ముగ్గురు అన్నదమ్ములు, చెల్లలు మధ్య వచ్చే “అందాల చిన్ని దేవత ” అనే పాట వారి అనుబంధాన్ని అర్ధంపడుతుంది. ఈ పాటను శంకర్ మాహదేవన్, సుజాత కలిసి ఆలపించారు.
పవన్ కళ్యాణ్ , భీమినేని శ్రీనివాస్ రావు కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అన్నవరం. ఇందులో చెల్లలు కోసం ఎప్పుడు తపించే అన్నయ్య పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాడు. ఇక సినిమాలో భాగంగా వచ్చే “అన్నయ్య అన్నావంటే ఎదురవనా” అంటూ చెల్లి కోసం అన్నయ్య పాడే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
హీరో రాజశేఖర్ , మీరా జాస్మిన్ అన్నాచెల్లులుగా నటించిన గోరింటాకు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక సినిమాలో భాగంగా వచ్చే “అన్నా చెల్లెలి అనుబంధం .. జన్మ జన్మలా సంబంధం” అనే సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక ఈ పాటను ఎస్పీ బాలు, చిత్ర కలిసి ఆలపించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో, అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. ఇందులో అర్జున్ చెల్లిగా మధుమిత నటించింది. చెల్లి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా చెల్లలు సీమంతం అప్పుడు అన్నయ్య పాడే ఈ పాట చెల్లెలుపై అతనికి ఉన్న ప్రేమను అద్దం పడుతుంది.
గణేష్ – వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలోని ‘సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు” అనే పాట తన చెల్లలి పైన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఇప్పటికి ఈ పాట ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
అన్నాచెల్లెలు – పేరుకి తగ్గట్టే అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధానికి చాటి చెప్పింది. ఇందులో శోభన్ బాబు సుమలత అన్నాచెల్లెళ్ళగా నటించారు. ఒక కొమ్మకు పూసిన పువ్వులం -ఎస్పీ బాలు , సుశీలమ్మ ఆలపించారు.
ఇలా ఎన్నో పాటలు అన్నాచెల్లెళ్ల అనుబంధాల్ని వివరించాయి. మన మదిలో నిలిచిపోయాయి. ఇంకా కొన్ని సినిమాల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగిన సన్నివేశాలు మన హృదయాల్లో నిలిచిపోయాయి. అందులో ఒక ఉదాహరణ నెంబర్ వన్. హీరో కృష్ట నటించిన ఈ సినిమాలో ఓ వైవిధ్యభరితమైన సన్నివేశం మీకోసం.