బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి ఉండే రేంజ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సల్లూ భాయ్ మూవీ వస్తుంది అంటే అభిమానులకి పండగే. ఇలాంటి సందర్భంలో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన ‘రాధే’ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది కొరియన్ మూవీ ‘ది అవుట్ లాస్’కి రీమేక్. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జీప్లెక్స్ ఓటీటీలో అభిమానుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తోందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా రాధే కథ విషయానికి వస్తే.. రానా అనే డాన్ ముంబయిలో పెద్ద డ్రగ్ డీలర్. దేశంలో అన్నీ ప్రాంతాలకి తన చీకటి వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్నది ఇతని ప్లాన్. ఈ క్రమంలో అతని చేతిలో చాలా మంది ముంబై పోలీసులు చనిపోతుంటారు. దీనితో డిపార్ట్మెంట్ గుండె ధైర్యం, తెగింపు ఉన్న పోలీస్ ఆఫీసర్ కోసం వెతుకుతారు. అప్పుడు వారికి రాధే కనిపిస్తాడు. అప్పటికే అతడిపై సస్పెన్షన్ వేటు ఉండటంతో దాన్ని ఎత్తేసి విధుల్లోకి తీసుకుంటారు. దీంతో రంగంలోకి దిగిన రాధే.. విలన్ గ్యాంగ్ ని ఎలా తుడి ముట్టించాడు అన్నది మిగతా కథ. చెప్పడానికి, వినడానికి ఈ కథలో కొత్తదనం ఏమి లేదు. ఇలాంటి సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషలలో చాలానే వచ్చాయి. ఈ మాత్రం దానికి కొరియన్ మూవీని రీమేక్ చేయాల్సిన అవసరం లేదు. సరే.., దాన్నైనా సరిగ్గా తెరకెక్కించారా అంటే అదీ లేదు. కేవలం సల్మాన్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా అంతటా ఎలివేషన్స్. ఎక్కడా హీరో క్యారెక్టర్ తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది. కానీ.., ఇలాంటి మాస్ మసాలా సినిమాని తెరకెక్కిస్తునప్పుడు మెయిన్ సోల్ పాయింట్ ని మిస్ కాకూడదు. కానీ.., ప్రభుదేవా ఇక్కడే తప్పు చేశాడు. దర్శకుడుగా ప్రభుదేవా పూర్తిగా సల్మాన్ క్రేజ్ పై డిపెండ్ అయిపోయాడు. దీనితో కథా, కథనం పై పట్టు కోల్పోయాడు. పైగా.., లాజిక్ కి అందని ఫైట్స్. చిరాకు పుట్టించే హీరోయిన్ క్యారెక్టరైజేషన్. ఇవన్నీ కూడా రాధే మూవీ చూసే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సల్మాన్ తో కాప్ స్టోరీ తీస్తే వాంటెడ్ మ్యాజిక్ ని రిపీట్ చేయొచ్చు అనే ఆశతో ప్రభుదేవా ఈ కథని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. కానీ.., ఇంప్లిమెంటేషన్ లో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. ఇక సల్మాన్ నటనలో గాని, లుక్ లో గాని అసలు కొత్తదనం ఏమి లేదు. దీనితో రాధే ట్రాక్ తప్పేసింది. ఈ మూవీలో అద్భుతంగా ఉన్న ఒకే ఒక్క అంశం నిర్మాణ విలువలు. హీరోనే నిర్మాత కావడంతో ఈ రిచ్ నెస్ వచ్చింది అనుకోవచ్చు. ఇక టెక్నీకల్ గా కూడా రాధే ఎక్కడా మెప్పించకపోవడం విశేషం. కేవలం యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులు, సల్మాన్ అభిమానులు మాత్రం ఈ మూవీని ఒక్కసారి చూడవచ్చు.