సినిమాలో నటించడమే కాదు, సినిమా అయ్యాక ఆ సినిమాని జనాల్లో తీసుకెళ్లేందుకు హీరోలు, నటులు అందరూ ప్రమోషన్ లో పాల్గొనాలని దర్శకులు, నిర్మాతలు నెత్తి, నోరూ బాదుకుంటున్నారు. కొంతమంది మాత్రం కుదరదని చెప్పేసి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ విషయంలో గతంలో నయనతారపై కూడా పలువురు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు స్టార్ కమెడియన్ విషయంలో ఒక నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతను నటించిన సినిమా ప్రమోషన్ లో పాల్గొనడానికి రాకపోగా.. సినిమాని ఎవరూ కొనొద్దని బయ్యర్లకు ఫోన్ చేసి మరీ తన సినిమా బిజినెస్ ని ఆపుతున్నారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని సదరు నిర్మాత కమెడియన్ ని బెదిరించారు.
తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ యోగిబాబు తెలుగులో అనువాదమైన చిత్రాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డబ్బింగ్ చిత్రాల్లో కూడా ఆయన పలికే హావభావాలని చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. శివకార్తికేయన్ నటించిన రెమో, వరుణ్ డాక్టర్ విజయ్ నటించిన సర్కార్, బీస్ట్, అదిరింది ఇలా అనేక డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. రీసెంట్ గా లవ్ టుడే సినిమాలో కూడా నటించారు. ఇంత క్రేజ్ ఉన్నటువంటి కమెడియన్ మీద తమిళ నిర్మాత గిన్నిస్ కిషోర్ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. గిన్నిస్ కిషోర్ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా దాదా.
ఈ సినిమాలో కమెడియన్ యోగిబాబు, నితిన్ సత్య లీడ్ హీరోలుగా.. గాయత్రి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీని బాగా ప్రమోట్ చేయాలని నిర్మాత భావించారు. అయితే యోగిబాబు ప్రమోషన్ కు సాయం చేయకపోగా.. తన సినిమా బిజినెస్ కాకుండా ఆపుతున్నారని ఆరోపించారు. సినిమాని ఎవరూ కొనవద్దని బయ్యర్లకు ఫోన్ చేసి.. సినిమా బిజినెస్ జరగకుండా అడ్డుకుంటున్నారని.. ఈ సినిమాలో తాను 4 సన్నివేశాల్లోనే నటించాను.. కాబట్టి సినిమా కొనకండి అంటూ యోగిబాబు దుష్ప్రచారం చేస్తున్నారని నిర్మాత ఆవేదన చెందారు.
తనకు అన్యాయం జరిగితే.. కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. యోగిబాబు 4 సన్నివేశాల్లో నటించారో, లేక 40 సన్నివేశాల్లో సినిమా చూశాక మీకే తెలుస్తుందని అన్నారు. సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి కూడా తమని అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. తన తర్వాతి సినిమాలో నటించడానికి కూడా అడ్వాన్స్ ఇచ్చానని, ఐతే ఇప్పుడు సినిమాలో నటించేందుకు నిరాకరించారని అన్నారు. దీనిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. తన సినిమాలో నటించకపోతే.. వేరే సినిమాలో నటించకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.