చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సీనియర్ కమెడియన్ కడలి జయసారథి మరణవార్త నుండి బయట పడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా ఆగష్టు 3న(బుధవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
కొన్నేళ్లుగా గుండె సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చతుర్వేది.. లక్నోలోని తన స్వగ్రామంలో మరణించారు. అయితే.. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నుండి కోలుకునేందుకే చతుర్వేది.. తన స్వగ్రామానికి చేరుకున్నారట. కానీ.. చేరుకున్న కొద్దిసేపటికే ఆయన మృతిచెందడం బాధాకరం. ఇక మిథిలేష్ మరణవార్తను ఆయన అల్లుడు ఆశిష్ చతుర్వేది సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ధృవీకరించారు.
ఇదిలా ఉండగా.. మిథిలేష్ చతుర్వేది దశాబ్దాలుగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ పాత్రలతో పాటు స్టార్ హీరోలందరి సినిమాలలో నటించారు. కోయి మిల్ గయా, గదర్ ఏక్ ప్రేమ్ కథ, సత్య, బంటీ ఔర్ బబ్లీ, క్రిష్, తాల్, రెడీ, అశోక మరియు ఫిజా వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అలాగే గులాబో సితాబో, స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో మెరిశారు. చివరిగా బంచాడా అనే సినిమాలో నటించారు. ఇక మిథిలేష్ అంత్యక్రియలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉండగా.. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.