యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్‌స్టోరీ ఈ నెల 24న థియేటర్లలో రిలిజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో లక్ష్మీదేవి, ఏసుక్రీస్తు చిత్రపటాలను పక్కపక్కన పెట్టడాన్ని తప్పుబడుతు ఓ చిన్నారి తీవ్రపదజాలంతో చిత్రదర్శకుడు శేఖర్‌కమ్ములను దూషించాడు. విచిత్రమైన వేషాధారణలో ఎవరో నేర్పిస్తే బట్టీ పట్టి వల్లెవేస్తున్నట్లు ఒక నిమిషం నిడివిగల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. చిన్నారి కంటే కూడా అతను ఇలా మాట్టాడేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులను, అందకు కారణమైన వారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చిన్న పిల్లలకు ఇలానా నేర్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము హిందువులమే సినిమాను మేము చూశాం అందులో మాకేమి తప్పు అనిపించిలేదు. అనవసరంగా పిల్లలను ఎందుకు ఇలా ఆగం చేస్తారంటూ ఆ చిన్నారి తల్లిదండ్రుల ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సినిమాలో హీరో క్రిష్టియన్, హీరోయిన్ హిందువు. ఇద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. ఎవరి నమ్మకాలకు అనుగుణంగా వారు తమతమ దేవుళ్లను పూచిస్తారు. ఇందులో అభ్యంతరం తెలిపేందుకు ఏమీ లేదని, అసలు సినిమాలో దర్శకుడు మతం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. అనవసరంగా పసి పిల్లల మనుస్సుల్లో విషబిజాలు నాటొద్దని కోరుతున్నారు.