మలయాళ చిత్రాలకు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఓటీటీల్లో రిలీజయ్యే మాలీవుడ్ మూవీస్‌ను చూసేందుకు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారి కోసం రెండు సినిమాలు వచ్చేశాయి. అవేంటంటే..!
సినిమాల పరంగా చూసుకుంటే మన దేశంలో ఇప్పుడు దక్షిణాదిదే హవా. పాన్ ఇండియా హిట్లుగా నిలుస్తున్న చిత్రాల్లో దాదాపుగా అన్నీ సౌత్ సినిమాలే. ముఖ్యంగా తెలుగు, కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీస్ భారతీయ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. దీంతో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ మేకర్స్ పాన్ ఇండియా చిత్రాలను తీసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూడు పరిశ్రమలకు భిన్నంగా మలయాళ మేకర్స్ విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వినూత్నమైన కథలతో, పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కళ్లుతిప్పుకోకుండా చేయడంలో మాలీవుడ్ మేకర్స్ ఆరితేరారు.
కరోనా టైమ్‌లో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఎక్కువగా చూసిన సినిమాలుగా మలయాళ మూవీస్‌ను చెప్పుకోవచ్చు. కొత్తదనం నిండిన కథలు, ఇంటెన్సివ్ యాక్టింగ్, అద్భుతమైన మేకింగ్‌తో భాషాభేదం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా సినిమాలు. అంతేకాకుండా డబ్బింగ్‌ల రూపంలోనూ ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కావడంతో వీటికి పాపులారిటీ బాగా పెరిగింది. ముఖ్యంగా మలయాళ క్రైమ్ యాక్షన్ డ్రామాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మలయాళం ఇండస్ట్రీ నుంచి రిలీజైన రెండు పెద్ద సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. అవే ‘థంకం’, ‘నాన్ పాకల్ నేరతు మయక్కమ్’. ఇందులో ‘థంకమ్’ చిత్రంలో బిజూ మీనన్, వినీత్ శ్రీనివాసన్ మెయిన్ రోల్స్‌లో నటించారు.
క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘థంకమ్’ చిత్రం జనవరి 26న బిగ్ స్క్రీన్స్‌లో రిలీజైంది. థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. త్రిస్సూర్‌లో గోల్డ్ ఏజెంట్స్‌గా పనిచేసే కన్నన్, ముత్తు అనే ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కిన ఈ మూవీకి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక, మరో మూవీ ‘నాన్ పాకల్ నేరతు మయక్కమ్’. ఈ సినిమాను లిజో జోస్ పెల్లిసెరి డైరెక్ట్ చేశారు. ఈయన గతంలో తీసిన ‘జల్లికట్టు’కు జాతీయ స్థాయిలో అపూర్వ ఆదరణ దక్కింది. మమ్ముట్టి హీరోగా నటించిన ‘నాన్ పాకల్’ గతేడాది డిసెంబర్ 12న రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ స్ట్రీన్ ప్లే కాస్త స్లోగా సాగుతుంది. కానీ ఇందులో మమ్ముట్టి యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి.. ఈ రెండు సినిమాల్లో మీరు దేన్ని చూడబోతున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.