దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు.. పరారీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చక్రి. ఇక ఆయన సంగీతం అందించిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు వంటి సినిమాలు మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుని.. వరుస అవకాశాలు అంది పుచ్చుకుంటున్న సమయంలో అనూహ్యంగా కన్నుమూశారు చక్రి. 2014లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు చేరి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.
తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆస్తి వివాదాలు, ఆ తర్వాత ఆయన వదిన రెండో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్బంగా మహిత్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తుల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధ.. మరోవైపు ఆస్తి వివాదాలు. ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము’’ అని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ‘‘అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని అమ్మేసుకుని వదిన అమెరికా వెళ్లిపోయింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులో నడుస్తున్నాయి’’ అని తెలిపాడు. మహిత్ నారాయణ ప్రస్తుతం పరారీ అనే సినిమాకు సంగీతం అందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.