తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నట శేఖరుడు కృష్ణ మృతి చెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఇక కృష్ణను ఆఖరి సారి చూడ్డం కోసం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి.. అభిమాన హీరోకు అశ్రు నివాళి అర్పించారు అభిమానులు. నిజ జీవితంలో కృష్ణ ఎంత గొప్పవాడో చెప్పుకుని పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఇక సీనియర్ నటుడు.. మురళీ మోహన్ ఏకంగా కృష్ణ పాడె మోశారు. అవును మరి వారిద్ధరి మధ్య అనుబంధం అలాంటిది. సినిమాల్లోకి రాకముందే.. కృష్ణ, మురళీమోహన్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇంటర్ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు మొదలైన వారి స్నేహం కడవరకు కొనసాగింది.
ఇక తమ ఇద్దరి స్నేహం గురించి ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ పలు ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. ‘‘1956లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సీఆర్ రెడ్డి కాలేజీలో మేమిద్దరం క్లాస్‌మెట్స్. ఇంకా చెప్పాలంటే బెంచ్‌మెట్స్ కూడా. క్లాస్ రూమ్‌లో ఇద్దరం ఒకే బెంచ్‌లో అది కూడా ముందు వరుసలో కూర్చునేవాళ్లం. అప్పటి నుంచి మా స్నేహంతో పాటు సినిమాలపై ఇంట్రస్ట్ పెరిగింది. సినిమా యాక్టర్ అయ్యి.. పడవ లాంటి పెద్ద కారు కొనాలని కృష్ణకి అప్పట్లోనే ఓ ఆశ ఉండేది. అనుకున్నట్లుగానే రెండేళ్ల పాటు శ్రమించి.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అయితే కాలేజీలో చదివే రోజుల్లో కృష్ణను ఏరా.. ఓరేయ్ అని అందరు స్నేహితులు ఎలా పిలుచుకునేవారో.. నేను కూడా అలానే పిలిచేవాడిని. అయితే నేను సినిమాల్లోకి వచ్చేసరికి కృష్ణ స్టార్ హీరో అయ్యాడు. అందుకే సినిమాల్లోకి వచ్చాక అలా ఏరా.. ఓరేయ్ అని పిలిస్తే బాగుండదనే ఉద్దేశంతో.. ఏవండీ అని పిలిచేవాడిని. కానీ నేను అలా పిలవడం కృష్ణకు నచ్చేది కాదు.. ఏయ్.. ఇదేంటి కొత్తగా ఏవండీ అని పిలుస్తున్నావ్ అని ప్రశ్నించేవాడు. కానీ అప్పటికే ఆయన పెద్ద స్టార్ హీరో.. అందుకే పాత రోజుల్లో మాదిరి.. తనను ఏరా అని పిలవలేను అంటూ కృష్ణకు వివరించాను’’ అని చెప్పుకొచ్చాడు.
అంతేకాక కృష్ణ చేసిన మేలు వల్ల.. ఇండస్ట్రీలో ఎందరో జీవితాలు ఒడ్డున పడ్డాయని తెలిపారు మురళీ మోహన్. సాధారణంగా ఓ డైరెక్టర్ ప్లాఫ్ సినిమా ఇస్తే.. మళ్లీ ఆ హీరోకి ముఖం చూపించాలంటే చాలా ఇబ్బంది పడతాడు. కనపడకుండా ఉండే ప్రయత్నం చేస్తాడు. అయితే కృష్ణ మాత్రం అలాంటి డైరెక్టర్లను పిలిచి మళ్లీ ఆపర్ ఇచ్చేవారు. ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోతే.. కృష్ణ హామీగా ఉండి సినిమాలు పూర్తి చేయించేవారు. నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నా సరే.. డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి డబ్బు సర్దుబాటు చేసి సినిమా తీయించేవారు. అది ఆయన గొప్పతనం అంటూ చెప్పుకొచ్చారు మురళీమోహన్.