మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు చాలా సినిమాలు హిట్ అనుకుంటున్నారు. అదే భ్రమలో టికెట్ కొని థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూసేస్తున్నారు. లేదంటే రెండు – రెండున్నర గంటలు టైం వేస్టు చేసుకుని మరీ ఓటీటీలో మూవీ చూసేస్తున్నారు. కట్ చేస్తే.. మీరు చూసిన సినిమా/ వెబ్ సిరీస్ చెప్పినంత గొప్పగా, మంచిగా ఉండకపోవచ్చు. ఇదంతా కూడా మీకు తెలియకుండా జరుగుతున్న మాయ. సాలెగూడులో ఈగ, దోమ చిక్కుకున్నట్లు మీరు ప్రతిసారి అందులో చిక్కుకుపోతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఒకప్పుడు సినిమా బాగుంటే బాగుంది లేకపోతే లేదు అనేది సినిమా చూసొచ్చిన ప్రేక్షకుడు మాత్రమే చెప్పేవాడు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కడూ సినిమా గురించి, దానిలో మెయిన్ ట్విస్టుల గురించి బయట పెట్టేస్తున్నాడు. చూసి చెబుతున్నాడో చూడకుండా చెబుతున్నాడో కూడా తెలియదని గానీ.. చూడాలనుకునే ప్రేక్షకుడి ఆత్రుతని చంపేస్తున్నాడు. ఈ క్రమంలో ఎంతో ఆశగా టికెట్ బుక్ చేసుకున్న మీరు.. ఇవన్నీ చూసి డిసప్పాయింట్ లేదా తెగ ఆనందపడిపోతారు. తీరా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నప్పుడు ట్విస్టులు ముందే తెలిసిపోవడంతో.. పెద్దగా కిక్ అనిపించదు. దీంతో మంచిగా ఉన్న సినిమా కూడా ఏదో సోసోగా అనిపిస్తుంది. అలా టాలీవుడ్ లో మంచి కంటెంట్ సినిమాతో తీసిన చిత్రాల చాలా వరకు బోల్తా కొట్టేసినవి ఉన్నాయి. ఆయా సినిమాల పేర్లు ఏంటనేవి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ కు ముందు ఆడియో సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యేవి. వాటిని వింటూ ప్రేక్షకుడు అంచనాలు పెంచేసుకునేవాడు. సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. బాగుంటే నలుగురికి చెప్పేవాడు. బాగోకపోతే అదే నలుగురికి చెప్పేవాడు. అయినాసరే జనాలు.. కొన్నాళ్ల ముందు వరకు సినిమా చూడటాన్ని ఎంజాయ్ చేసేవాడు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత మొత్తం గందరగోళం అయిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ అని.. గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ మైండ్ ని డిస్ట్రబ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఆయా సినిమాల టీజర్, ట్రైలర్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయని పదేపదే పబ్లిసిటీ చేసి కచ్చితంగా సినిమాకు వెళ్లి తీరాల్సిందే అని ఆలోచనని ప్రేక్షకుల మైండ్ లోకి ఎక్కించేస్తున్నారు.
అలానే ఒకప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం టీవీలు, అందులో వచ్చే ప్రోగ్రామ్స్ చూసేవారు. కానీ ఇప్పుడు ఇన్ స్టా, స్నాప్ చాట్ అని మన టైం తినేసే రకరకలా యాప్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్ లో వాటిని స్క్రోల్ చేస్తే చాలు గంటలు గంటలు అలా గడిచిపోతూనే ఉంటాయి. ఇప్పుడు వాటిపైనే పూర్తిగా దృష్టి సారించిన నిర్మాతలు.. తన సినిమాలు రిలీజ్ కి రెడీ అయిందనగానే.. మీమ్ పేజుల్లో తమ చిత్రాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. దానికోసం కొంత డబ్బు, వస్తువులు కూడా ఇస్తున్నారు. మీమ్ పేజుల్లో సినిమా గురించి పాజిటివ్ గా కనిపించగానే మీరు దాన్ని నమ్మి సినిమాకు వెళ్లడం అనేది పెద్ద మాయలా తయారైంది. దీంతో చాలా సినిమాలు బాగలేకపోయినా సరే హిట్ అవుతున్నాయి. కాదు కాదు హిట్ అయ్యేలా చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కింద కామెంట్స్ లో దాన్ని పోస్ట్ చేయండి.