అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో తెలుగు ప్రేక్షకులను వాసుకీ మెప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్క్రీన్ నేమ్ కూడా పాకీజాగానే చలామణి అయ్యింది. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. అటు తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఒక వెలుగు వెలిగిన తార ఆవిడ. కానీ, ఇప్పుడు అత్యంత దైనీయ పరిస్థితిలో ఉన్నారు. తాజాగా సుమన్ టీవీ ఆవిడను ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆవిడకు ఆర్థికసాయం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకు మెగా బ్రదర్ నాగబాబు ఆపన్న హస్తం అందించారు.
వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు. కాలక్రమేణ ఆవిడ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఇప్పుడు అవకాశాలు లేక, కనీసం తినడానికి తిండిలేక ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సుమన్ టీవీ చెన్నైలో ఉన్న సమయంలో ఆవిడ కనిపించగా ఆవిడను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సుమన్ టీవీ తరఫున ఆవిడకు భోజనం పెట్టిచండమే కాకుండా.. ఆర్థికసాయం కూడా చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాకీజాకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు.
ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు చేరారు. పాకీజా ఇంటర్వ్యూ చూసి ఆయన చలించిపోయారు. ఆవిడకు లక్ష రూపాయల ఆర్థికసాయం కూడా చేశారు. అంతేకాకుండా పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం బాధగా ఉందన్నారు. బుల్లితెర కానీ, సినిమాల్లో కానీ.. చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు సాయపడాలని విజ్ఞప్తి చేశారు. తన వంతు ప్రయత్నం కూడా చేస్తానని నాగబాబు హామీ ఇచ్చారు. తాను సాయం చేశారనే విషయాన్ని చెప్పేందుకు ఒప్పుకోని నాగబాబు.. అలా అయినా మరికొంత మంది సాయం చేసేందుకు ముందుకొస్తారనే భావనతో అంగీకరించారు.
ఇంటర్వ్యూ చేసే సమయంలో నాగబాబు- వాసుకీతో వీడియో కాల్ లో మాట్లాడారు. నాగబాబు సాయం చేశారని తెలుసుకుని ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎదురుగా ఉంటే నాగబాబు కాళ్లు మొక్కుతానంటూ వాసుకీ భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ్ లో అన్ని సినిమాలు చేసినా ఏ ఒక్కరు ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఇచ్చిన వాళ్లు లేరన్నారు. ఇప్పుడు ఒక ముద్ద తింటున్నారు అంటే అది తెలుగువాళ్లు పెట్టిన భోజనమే అంటూ వాసుకీ కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమన్ టీవీ చేసిన పాకీజా ఇంటర్వ్యూని కూడా నాగబాబు మెచ్చుకున్నారు. అలాంటి వారి కష్టాలను నలుగురికి తెలిసేలా చేసి మంచి పని చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.