సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీనా కూతురు మాట్లాడుతుండగా ఇలా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90ల్లో తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య లాంటి వాళ్లతో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రజనీకాంత్ లాంటి వాళ్లతో సినిమాలు చేసింది. స్టిల్ ఇప్పటికీ ‘దృశ్యం’ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మీనా.. రీసెంట్ గా నటిగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ని చెన్నైలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇందులో రజనీకాంత్, రాధిక, బోనీ కపూర్, సంఘవి లాంటి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ మీనా కూతురు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఏకంగా రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది.
అసలు విషయానికొస్తే.. హీరోయిన్ గా చాలా పేరు తెచ్చుకున్న మీనా, కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే బిజినెస్ మ్యాన్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. వీళ్ల బంధానికి గుర్తుగా 2012లో నైనిక పుట్టింది. ఓవైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అలాంటిది సడన్ గా గతేడాది, విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో మీనాపై చాలావార్తలొచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆమె కూతురు నైనిక ప్రస్తావించింది. తన తల్లి గురించి ఫేక్ వార్తలు రాయొద్దంటూ క్యూట్ క్యూట్ చెబుతున్న ఓ వీడియోని స్క్రీన్ పై ప్లే చేసి మీనాకు సర్ ప్రైజ్ ఇచ్చింది.
‘అమ్మ(మీనా).. నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ఓ నటిగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావ్. సెట్ లో నువ్వు యాక్టర్ అయ్యిండొచ్చు కానీ ఇంటికి వస్తే అలా కాదు. ఓ అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓసారి మాల్ కి వెళ్తే నిన్ను చాలా కంగారు పెట్టాను. ఆ తర్వాత నువ్వు నాపై కేకలు వేశావ్. అప్పుడు నిన్ను కంగారు పెట్టినందుకు సారీ. నాన్న చనిపోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నువ్వు డిప్రెషన్ లోకి వెళ్లిపోయావు. ఇకపై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. అన్ని విషయాల్లో సాయం చేస్తాను. రీసెంట్ టైంలో అమ్మ గురించి కొన్ని ఛానెల్స్ లో ఫేక్ వార్తలొచ్చాయి. ఆమె కూడా మీలాంటి మనిషే. కాబట్టి ఇలాంటి న్యూస్ రాయొద్దు’ అని నైనిక మాట్లాడింది. ఈ వీడియో స్క్రీన్ పై ప్లే చేస్తుండగానే రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. మరి మీనా కూతురు మాటలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.