ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు.
మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ప్రకాష రాజ్ తోపాటు ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కల్చరల్ సెంటర్ లో కొత్త కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.
విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూజలో మంచు విష్ణు, నరేశ్, శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం చిరంజీవి హాజరు కాలేదు.. అంతే కాదు మెగా హీరోలు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.