పవన్ కళ్యాణ్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి వచ్చి.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందిన సినిమా నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టుకున్న ఒక ప్రముఖ వ్యక్తి. సింపుల్‌గా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ అంటే ఇంతే. పైగా పేరుకు సినిమా హీరోనే కానీ.. గొప్ప నటుడు కాదు, అద్భుతమైన డాన్సర్ కాదు, కండలు తిరిగిన దేహం లేదు. అలాగే రాజకీయంగా దాదాపు 14 ఏళ్ల ప్రస్థానం ఉన్నా.. అధికారం లేదు.. పదవులు అధిష్టించలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏదో తెలియని ఒక అద్భుతం. అతనంటే యువత ఎందుకు పడిచస్తుందో చాలా మందికి అర్థం కానీ.. అంతుపట్టని బ్రహ్మపదార్థం.
అతని పేరు చెబితేనే కొంతమంది పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అతన్ని చూసేందుకు ఎగబడే యువకులను చూస్తే.. వీళ్లకు ఇంత పిచ్చి ఏంటో అని అనుకుంటాం. సినిమా హీరోగా అతను తీసింది పట్టుమని పాతిక సినిమాలు. అందులో 9 సినిమాలు మాత్రమే ఆడాయి. దాదాపు పదేళ్ల పాటు హిట్‌లేదు. ఇదే పరిస్థితి ఇండస్ట్రీలో మరో యువ హీరోకి వచ్చి ఉంటే.. కచ్చితంగా సినీ జీవితానికి ప్యాకప్ చెప్పాల్సిందే. కానీ.. పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. అతనితో సినిమా తీసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతూనే వచ్చారు. అతని సినిమాలు ఆడకపోయినా ఎందుకు ఇంతమంది అభిమానిస్తారో.. ఆరాధిస్తారో.. తెలియదు. కానీ.. ఆ పిచ్చి అభిమానం ఎప్పుడు మొదలై.. ఎక్కడ పీక్స్‌కి చేరిందో మాత్రం చెప్పవచ్చు.
1996లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో ‘చిరంజీవి తమ్ముడి’గా తెరంగేట్రం చేసిన పవన్.. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో చిరంజీవి తమ్ముడిగానే మిగిలిపోయాడు. తొలిప్రేమ ఇచ్చిన హిట్‌తో యువత హృదయాల్లో స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్‌గా మారిన కళ్యాణ్‌బాబు, అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ వెంటనే తమ్ముడు, బద్రి సినిమాలతో పవన్ కళ్యాణ్ అనే పేరును స్టార్ హీరోగా రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఖుషి’ అనే సినిమాతో తెలుగు చలన చిత్ర రికార్డులన్నీ తిరగరాశాడు.
ఎన్నో రికార్డులను ఖుషి బద్దలు కొట్టింది. అన్నింటి కంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి తమ్ముడనే ముద్రను చెరిపివేసింది. సరిగ్గా 21 ఏళ్ల క్రితం వచ్చిన ఖుషి అప్పటి యువతను ఊపేసింది. కోట్ల మందికి పవన్ కళ్యాణ్ పిచ్చి పట్టింది అప్పుడే. ఆ సినిమా మళ్లీ ఇప్పుడు థియేటర్లలో సందడి చేయనుంది. శివరాత్రికి వేసే స్పెషల్ షోలా, ఈ మధ్య మొదలైన రీ రిలీజ్‌లా కాకుండా.. ఏకంగా వారం రోజులు ఖుషిని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది పండుగ లాంటి విషయమే అయినా.. పవన్ ఫ్యాన్స్ కానీ వారు కూడా ఖుషి సినిమాను ఎందుకు చూడాలో ఇప్పుడు మాట్లాడుకుందాం.
పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన ఖుషి సినిమాను ఎస్‌జే సూర్య డైరెక్ట్ చేశారు. భారీ ట్విస్ట్‌లు, భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌లు లేని ఒక సింపుల్ లవ్‌స్టోరీ. ప్రేమ, ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న ఇగోలే ఈ సినిమా ముడిసరుకు. క్లుప్తంగా చెప్పాలంటే ఖుషి కథ ఇదే. కానీ.. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు.. ప్రతి సన్నివేశం ఒక అద్భుతం. చాలా చిన్న చిన్న ఎమోషన్సే కానీ.. మనసుకు హత్తుకుంటాయి. 21 ఏళ్ల క్రితం ఖుషి చూసిన వారికైనా సరే.. ఇప్పటికీ ఇద్దరు పసిబుగ్గల చిన్నారుల చేతులని ఒక చోట చూస్తే.. అరె సేమ్ ఖుషి సినిమాలోని ఆ పిల్లలే గుర్తుకు వస్తారు. గొప్ప నటుడని పవన్‌కు పేరు లేకపోయినా.. ఖుషిలో అతని ఎక్స్‌ప్రెషన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన బ్యాగ్ అప్పట్లో ఒక సంచలనం. కాలేజీకి వెళ్లే ప్రతి కుర్రాడు ఓ పవన్ కళ్యాణ్‌లా ఫీలైపోతూ.. అలాంటి బ్యాగ్‌లు ధరించేవారు. చెడు అలవాటే అయినా.. ఖుషిలో పవన్ కళ్యాణ్ సిగరేట్ తాగడం చూసి.. స్టైల్‌గా సిగరేట్ తాగాలని అనుకున్న వారు, తాగిని వారు కూడా చాలా మందే ఉన్నారు. మెడ మీద చేయి పెట్టే పవన్ కళ్యాణ్ మ్యానరిజం ఒక బ్రాండ్‌గా మారింది ఖుషితోనే. 21 ఏళ్ల క్రితం కాలేజీలకు వెళ్లిన యువత మొత్తం ఖుషిలో పవన్ కళ్యాణ్‌లో తమని తాము చూసుకున్నారు. అలీతో వచ్చే కామెడీ ట్రాక్ అయినా.. పవన్ కళ్యాన్ భూమికల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ యువతను కట్టి పడేశాయి. పవన్-భూమికల మధ్య నడుము చేసే సీన్ అయితే.. కుర్రకారు హృదాయాలను కొల్లగొట్టింది. తమ ప్రేయసితో తాము మాట్లాడుతున్నట్లు, వారితో గొడవపడుతున్నట్లు.. ఫీలైపోయారు. దాంతో ఖుషి సినిమా కాదు.. తమ కథే తెరపై వచ్చిందంటూ భావించారు.
ఖుషిలో వచ్చే ప్రతి సీన్ ఒక అద్భుతమే.. స్కిప్ చేయడానికి స్కోప్‌లేని సినిమా ఖుషి. ఇక పాటల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మణిశర్మను మెలోడి బ్రహ్మా అని ఎందుకు అంటారో ఖుషి చూస్తే అర్థం అవుతుంది. ప్రతి పాట ఒక సంచలనం. క్లాస్ మూవీ అయినా ఈ సినిమాలో ‘గజ్జె ఘళ్లు మన్నాది రో..’ అనే మాస్ బీట్ కూడా అలంకరంగా మారిపోయింది. ‘ఏ మేరా జహా..’అనే పాట మొత్తం హిందీలోనే ఉన్నా.. తెలుగు ప్రజలు ఊగిపోయారు. ‘అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..’ అనే పాటకు డాన్స్ వేయని కాలేజీ కుర్రాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మిగిలిన పాటలు ఎప్పుడు విన్నా.. మనసుకు ఎదో తెలియని ఒక హాయి.
పాటలతో పాటు స్టైలిష్ ఫైట్లు కూడా ఖుషి సొంతం. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పవన్ కళ్యాణ్.. కత్తితో చేసే ఫైట్ ఆ ఫైట్ తర్వాత చెప్పే.. ‘సిద్ధూ.. సిద్ధర్థరాయ్’ డైలాగ్ థియేటర్లలో యువకులను బట్టలు చింపుకునేలా చేసింది. కథ ఎలా నడినిచినా.. మతి భ్రమించే ట్విస్ట్‌లు ఎన్ని ఉన్నా.. చివరికి హీరో హీరోయిన్ తమ ప్రేమను గెలిచి ఒక్కటవ్వడం అనేది తెలుగు సినిమాల్లో రాజ్యాంగ సూత్రం. ఖుషిలోనూ హీరో హీరోయిన్లు చివరికి కలుస్తారు. అయినా.. కూడా క్లైమాక్స్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వచ్చే సీన్స్, ఒకరి కోసం ఒకరు వెత్తుకునే సీన్స్ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను, ఏదో తెలియని బాధను రేకిస్తాయి. ఖుషిలో ఉండే మ్యాజిక్ అదే. చిన్న సన్నివేశమే అయినా.. ఎమోషన్ భారీగా క్యారీ అయింది. అందుకే తెలుగు సినిమా చరిత్రలో, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఖుషి ఒక అద్భుతం. పవన్ అభిమానులకు ఒక డ్రగ్‌లాగా ఎక్కిన మత్తు ఖుషి. మరి అలాంటి అద్భుతాన్ని మరోసారి పెద్ద తెరపై చూసే అవకాశం దక్కుతోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఖుషి సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఖుషి సినిమాకు టిక్కెట్లు బుక్ చేసుకోండి.. ఖుషి సినిమాపై మీ అభిప్రాయాలను, అనుభూతులను కామెంట్ల రూపంలో పంచుకోండి.
Madhyalo trim chesaru. Here is the uncut version. #KushiReReleaseTrailer https://t.co/1C1jnfmlEU pic.twitter.com/YvKcH7Ze97
— KARTHIK REDDI (@karthikreddi7) December 25, 2022