మన దేశంలో సినీ, క్రీడా ప్రముఖులకు ఉండే క్రేజే వేరు. వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమాన స్టార్‌లు, క్రీడాకారుల కోసం ఫ్యాన్స్ ఏం చేయాడానికి అయినా రెడీగా ఉంటారు. వారిని చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇక తాజాగా అభిమాన హీరో కోసం ఓ వ్యక్తి చేసిన పని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అభిమాన హీరో మృతి చెందితే.. సదరు వ్యక్తి.. ఏకంగా హీరో పెద్ద కర్మ నిర్వహించి.. తను ఉండే ప్రాంతంలో అందరికి భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ వార్త అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంలో ఆదివారం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లాలోని రాజాం, వస్త్రపురి కాలనీకి చెందిన గొట్టాపు వెంకటరావు అనే వ్యక్తి.. స్థానిక వరలక్ష్మీ జ్యూట్ మిల్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. అతడికి సూపర్‌స్టార్ కృష్ణ అంటే ప్రాణం, పిచ్చి అని చెప్పవచ్చు. కృష్ణకి వీరాభిమాని అయిన వెంకటరావు.. ఆయన మృతి చెందాడనే వార్త విని ఎంతో బాధపడ్డాడు. తన ఇంట్లో వ్యక్తి మృతి చెందితే ఎంత బాధ పడతాడో.. అంతలా విలవిల్లాడాడు. తన అభిమాన హీరో గురించి స్నేహితుల వద్ద చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు వెంకటరావు.
అంతేకాక.. ఇక ఆదివారం తన అభిమాన నటుడి పెద్ద కర్మ అని తెలుసుకున్న వెంకటరావు తాను కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తాను నివాసం ఉంటున్న కాలనీలో ప్రతి ఇంటికీ వెళ్లి.. వారిని భోజనానికి ఆహ్వానించాడు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. అభిమాన నటుడిపై వెంకటరావు చూపిస్తున్న ప్రేమకు వారంతా ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ.. ‘‘నాకు ఊహ తెలిసిన నాటి నుంచి కృష్ణకు వీరాభిమానిని. ఘట్టమనేని వంశానికి అంకితం అయ్యాను. ఇక కృష్ణ మృతి చెందిన వార్త విని ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబ సభ్యుల్లాగే.. నేను కూడా నా అభిమాన హీరో పెద్ద కర్మ నిర్వహించాలని భావించాను. నా శక్తి మేరకు కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేశాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపాడు.
ఇక ఈ కార్యక్రమానికి స్థానిక మహేష్ బాబు అభిమానులు, జ్యూట్ మిల్‌లో తన సహచర ఉద్యోగులు కూడా తమవంతు సహకారం అందిచినట్లు చెప్పిడు. కాలనీలోని పెద్దలు, పిల్లలు అందరూ వెంకటరావు ఇచ్చిన విందు ఆరగించారు. బిర్యానీ, చికెన్‌తో వెంకటరావు విందు ఏర్పాటుచేయడం విశేషం.