‘కోట శ్రీనివాసరావు‘ ఈ పేరు తెలుగు చిత్రసీమ మాత్రమే కాదు, తమిళ్, మలయాళం, హిందీ అభిమానులకు సుపరిచితమే. 1978లో ‘ప్రాణంఖరీదు‘తో సినీ జీవితం ప్రారంభిచారు. అప్పటి నుంచి దాదాపు 750కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్ ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. తన నటనకు గుర్తింపుగా 9 నంది అవార్డులు, 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక తప్పు వల్ల ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు కోట శ్రీనివాసరావు.
1987లో సూపర్‌స్టార్ కృష్ణ నిర్మించిన ‘మండలాధీశుడు‘ సినిమాలో కోట శ్రీనివాసరావు లీడ్ రోల్, భానుమతి హీరోయిన్, ఎమ్.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొత్తం నందమూరి తారకరామారావు రాజకీయ జీవితం గురించి తీసిన సినిమా. అందులో సన్నివేశాలన్నీ ఆయనను ఎద్దేవా చేసేలా ఉంటాయి. చాలా బలవంతం మీద ఆ సినిమా ఒప్పుకున్నా అని కోట శ్రీనివాసరావు చెప్తుంటారు. ‘ఆ సమయంలో ఏం చేయాలో తెలీదు.. సెలవులు అయిపోయాయి ఇంక వెనక్కి రండని బ్యాంకు వాళ్లు పిలుస్తున్నారు. సరే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను‘ అని కోట గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాతో అవకాశాలకు కొదవే లేకపోయినా.. శత్రువులను బాగానే పెంచుకున్నారు. ఆ సినిమా తర్వాత జరిగిన ఎన్నో అవమానాలను ప్రస్తావించారు.
‘ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకరోజు సెలవు దొరికిందని.. అప్పుడే పెళ్లయి బెజవాడలో కాపురం పెట్టిన పెద్దమ్మాని చూసొద్దామని వెళ్లా. రైల్వే స్టేషన్‌లో దిగాను. బెజవాడలో నాయీ బ్రాహ్మణుల కల్యాణ మండపం ప్రారంభించి ఎన్టీఆర్ వెళ్తున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. వారిలో ఎవరో అరే కోటగాడురా అన్నాడు. అందరూ నా వెంట పడ్డారు. నేను పరిగెత్తాను.. నా వెనకాల వచ్చారు. తోసేస్తే కింద పడ్డాను. ఒకడు గుండెల మీద కూర్చుని చెప్పు తీశాడు. తప్పేదేముందిలే అని ఊరుకున్నాను‘ అని చెప్పుకొచ్చారు.
‘ఇప్పుడేదో బాలకృష్ణ వారందరూ కోట మంచి ఆర్టిస్టు అంటున్నారు. జంధ్యాల సినిమా కోసం నేను రాజమహేంద్రవరం వెళ్లాను. బాలకృష్ణ ఏదో షూటింగ్‌కి వచ్చాడు. లిఫ్ట్ దగ్గర నుంచోని ఉన్నా.. పక్కవాళ్లు సైగలు చేస్తున్నారు తప్పుకో తప్పుకో అని. తీరా చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు. నేను గౌరవంగా నమస్కారం బాబు అన్నాను. కాండ్రించి మొహాన ఉమ్మేశాడు. మన నాన్నని తిడితే మనకు కోపం రాదు. అందులోనూ ఆయన ముఖ్యమంత్రి అబ్బాయి. లైఫ్ అన్నాక అలాంటివి జరుగుతూనే ఉంటాయి. నా ప్రమేయం లేకుండా సినిమా తీయలేరు కదా‘. అలా జరిగిపోయింది అంటూ అప్పటి సందర్భాలను గుర్తుచేసుకున్నారు కోట శ్రీనివాసరావు. పూర్తి ఇంటర్వ్యూని ఈ వీడియోలో చూడండి.