ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా జరిగే హాలోవీన్ పార్టీ వేడుకలు దక్షిణ కొరియాలో విషాదాన్ని నింపాయి. దక్షిణ కొరియాలోని ఇటాయ్‌వాన్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన హాలోవీన్ పార్టీలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో జనం ఒక్కసారిగా పరుగులు మొదలుపెట్టారు. దాదాపు లక్ష మంది పరుగులు పెట్టేసరికి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 154 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 132 మంది దక్షిణ కొరియా వాళ్లు కాగా, మిగిలిన వాళ్లంతా వేరే దేశానికి చెందిన వాళ్లు. దక్షిణ కొరియాకు చెందిన మృతుల్లో ప్రముఖ నటుడు, సింగర్ లీ జిహాన్ కూడా ఉన్నారు.
తొక్కిసలాటలో సామాన్య జనంతో పాటు ఆయన కూడా కన్నుమూశారు. ఈ మేరకు 935 ఎంటర్‌టైన్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 29న రాత్రి ఇటాయ్‌వాన్‌లో జరిగిన తొక్కిసలాటలో లీ జిహాన్ కన్నుమూయటం వాస్తవమని పేర్కొంది. అది నిజం కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ వార్త తెలిసి షాక్‌కు గురైనట్లు పేర్కొంది. అతడి కుటుంబం ప్రస్తుతం శోఖ సంద్రంలో మునిగిపోయిందని వెల్లడించింది. అతడు ఎంతో మంచి వ్యక్తని, అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండేవాడని పేర్కొంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే..
అందరినీ ప్రేమగా పలకరించే అతడ్ని ఇకపై చూడలేమంటే నమ్మలేకుండా ఉన్నామని తెలిపింది. లీ జిహాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించింది. ఇక, సోషల్ మీడియాలోనూ లీ జిహాన్ మృతిపై సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు బాధాతప్త హృదయాలతో అతడికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా, లీ జిహాన్ 2017లో వచ్చిన ‘ప్రొడ్యూస్ 101’లో కంటెస్టెంట్‌గా జనానికి పరిచయం అయ్యారు. 2019లో వచ్చిన ‘‘ టు డే వాస్ అనదర్ నామ్ హ్యూన్ డే’ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. లీ జిహాన్ వయసు ప్రస్తుతం 24 ఏళ్ల మాత్రమే కావటం గమనార్హం.