సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం.. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే సొసైటీలో సెలబ్రెటీ హోదా వస్తుందని అంటారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట పడిగాపులు కాస్తు ఉంటారు. కానీ వెండితెరపై కనిపించే కొంత మంది సెలబ్రెటీల హోదాల్లో కన్నీటి కష్టాలు ఉంటాయని వింటూనే ఉంటాం. పాత తరం హీరోయిన్లలో కాంచన గురించి తెలియని వారు ఉండరు. అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు కాంచన. అప్పట్లోనే మోడ్రన్ డ్రెస్సుల్లో హుషారెత్తించే పాత్రల్లో నటించిన తన ప్రత్యేకత చాటుకున్నారు. అంతగొప్ప సెలబ్రెటీ హోదా అనుభవించిన ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు దాగి ఉన్నాయి.
70వ దశకాలలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిన అందాల తార కాంచన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నేను తమిళనాడులో పుట్టిపెరిగాను.. చిన్ననాటి నుంచి ఎంతో హుషారుగా ఉండేదాన్ని.. మా కుటుంబం కష్టాల్లో ఉన్న విషయం గ్రహించి నేను ఎయిర్ హూస్ట్ గా జాబ్ చేశాను. ఆ సమయంలో నాకు నెలకి రూ.600 ఇచ్చేవారు. అది నాకు ఎంతో గొప్పగా అనిపించేది.. ఎయిర్ హూస్గ్ డ్రెస్ వేసుకున్నపుడు కలిగే ఆనందమే వేరు’. ఎయిర్ హూస్ట్ గా జాబ్ చేస్తున్న సమయంలో సువర్ణ సుందరి సినిమాలో నాగ కన్య వేషం లభించింది.. ఆ తర్వాత 1970 దర్శకుడు శ్రీధర్ ‘ప్రేమించి చూడు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా మంచి హిట్ సినిమాల్లో నటించే అదృష్టం దక్కింది’ అన్నారు.
‘సినిమాల్లో ఎంత మోడ్రన్ లుక్ లో కనిపించినా.. బయట చాలా సాంప్రదాయంగా ఉండేదాన్ని.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తిపాస్తులు బాగానే సంపాదించాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి పెద్ద హోదాల్లో ఉన్నవారు ముందుకు వచ్చారు. అదే సమయంలో మా అమ్మ పిన్ని కొడుకు నాకు శాపంగా మారాడు. అతన్ని మా కుటుంబం బాగా నమ్మేది.. అమ్మానాన్న అతడు ఏది చెబితే అదే వేదంగా భావించేవారు. దాన్ని ఆసరాగా తీసుకొని వాడు నా ఆస్తులన్నీ పొగొట్టాడు. ఆ ఆస్తి కోసం పోరాటానికి నా జీవితం మొత్తం సరిపోయింది’అంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.