టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫీ అందించిన రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మరణం తర్వాత ఆయన గొప్పతనం గురించి మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, యూట్యూబ్ స్టార్ రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ పనిచేసిన ఆయన చివరి దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమకు దూరమై యూట్యూబ్ ఛానెళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. రాకేష్ మాస్టర్ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా ఆయన తనయుడు చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
రాకేష్ మాస్టర్ 1968వ సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో మద్రాస్ లో కొంతమంది వద్ద డ్యాన్స్ గ్రూప్ లో ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశారు. రాకేష్ మాస్టర్ కెరీర్ లో ఎంతోమంది శిశ్యులను తయారు చేశారు.. అందులో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. ఇక సినీ రంగానికి చెందిన వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష ఇలా ఎంతోమందికి సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. రాకేష్ మాస్టర్ చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగి అంతే వేగంగా కిందకి పడిపోయాడు. ఇండస్ట్రీలో విభేదాలు వచ్చి డిప్రేషన్ లోకి వెళ్లిపోయారు.. ఆ తర్వాత కొంతమంది సెలబ్రెటీలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ నెగిటీవ్ అయ్యారు.
ఇటీవల కాలంలో ఆయన యూట్యూబ్ ఛానల్ వైపు దృష్టి సారించి ఎన్నో కాంట్రవర్సీలకు తెరలేపారు. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో సినీ ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. యూట్యూబ్ మాయాజలంలో పడిపోయి ఆయన తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లాడు. యూట్యూబ్ ఛానల్స్ లో ఆయన చేసిన కాంట్రవర్సీకి కొన్నిసార్లు రాకేష్ మాస్టర్ పై దాడులు కూడా జరిగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు దూరంగా వెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే రాకేష్ మాస్టర్ ని పలు యూట్యూబ్ ఛానల్స్ ఏ రకంగా వాడుకోవాలో.. క్యాష్ చేసుకోవాల ఆ రకంగా చేసుకున్నాయని ఆయన ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చివరి దశలో ఆయన పరిస్థితి మరీ దుర్భరంగా మారింది.. అనాధాశ్రమంలో ఆశ్రయం పొందే పరిస్థితి చేరుకున్నారని అంటారు.
ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చినా.. తన సొంత ఛానెల్ లో అయినా ఏనాడు తన కుటుంబం గురించి చెడుగా మాట్లాడలేదు రాకేష్ మాస్టర్. తన భార్య లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని.. ఆమె ఎన్నో కష్టాలు పడుతుందని అనేవారు. తన కూతురు రిషిక, కొడుకు చరణ్ గురించి కూడా గొప్పగా చెప్పుకునేవారు. ఇకప్పుడు నెగిటీవ్ గా చూపించిన మీడియా ఇప్పుడు రాకేష్ మాస్టర్ గొప్పతనం గురించి తెగ చెప్పేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రాకేష్ మాస్టర్ తనయుడు చరణ్ వైరల్ కామెంట్స్ చేశారు.
‘మా నాన్న ఇంతలా దిగజారిపోవడానికి మీడియానే కారణం.. ఆయనను ఎంత నెగిటీవ్ గా చూపించాలో అంతగా చూపించారు.. ఇక చాలు ఆయనకు సంబంధించిన విషయాలు, మా కుటుంబ సభ్యుల జోలికి మీడియా వస్తే ఊరుకునేది లేదు.. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని మీడియాలో ఎక్స్‌పోజ్ చేసి అల్లరి చేసింది చాలు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ కష్టాలు ఏంటీ? మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? చనిపోతే మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే మీడియాలో చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి.. అలా మా జీవితాల్లోకి వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని రాకేష్ కొడుకు ఎంతో ఆవేదనగా, ఆవేశంగా మాట్లాడటం వైరల్ గా మారింది.