సినిమా కావచ్చు.. వ్యక్తిగతం కావచ్చు నటుల కంటే.. నటీమణుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వెండి తెరను ఏలుతున్న రారాణి అయినా భర్త విషయంలో తగ్గక మానదు. ఇది నూటికి 80 శాతం మంది ఆడవాళ్ల విషయంలో జరుగుతోంది.
కొంతమంది సినిమా వాళ్ల జీవితాలు సాధారణ మనుషుల జీవితాల కంటే చిత్రంగా ఉంటాయి. ఎంత పేరు ఉన్నా.. ఎంత ఫేమ్ ఉన్నా అది వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం మేలు చేయదు. ముఖ్యంగా నటీమణుల విషయంలో ఇది నూటికి నూరు శాతం వర్తిస్తుంది. సినిమాలో హీరోయిన్ చెడు వ్యసనాలకు బానిసైన భర్తను మార్చుకుంటుంది. కానీ, నిజ జీవితంలో చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే అలా జరుగుతుంది. మిగిలిన సందర్భాల్లో భర్త కారణంగా భార్య జీవితం కూడా నాశనం అవుతుంది. ఇందుకు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీమణుల జీవితాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రముఖ సీనియర్ నటి కాకినాడ శ్యామల జీవితం కూడా ఈ కోవకు చెందిందే.
ఆమె భర్త తన చెడు వ్యసనాల కారణంగా ఏకంగా 600 ఎకరాల భూమిని 30 ఎకరాలకు తీసుకువచ్చాడు. భర్త కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ.. ‘‘ మరో చరిత్ర సినిమాతో నా సినిమా జీవితం మొదలైంది. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించాను. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ‘నిత్య సుమంగళి’ అనే మూవీ తీశాను. ఆ సినిమా బాగానే ఆడింది. కానీ, డిస్ట్రిబ్యూటర్ మోసం చేయడంతో డబ్బులు పోగొట్టుకున్నాను.
తర్వాత ‘పచ్చబొట్టు’ అనే సినిమా తీశాం. అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్‌తో విభేదాలు వచ్చాయి. సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆగిపోయింది. ఆ సమయంలోనే మా ఆయనతో నాకు పెళ్లి అయింది. మా మామ మా ఆయనకు 600 ఎకరాలు రాసిచ్చారు. నా భర్త మంచి రసికుడు. పైగా పని పాటా లేదు. దీంతో 600 ఎకరాలను 30 ఎకరాలు చేశాడు. నేను ఆయన్ని బాగా తిట్టేదాన్ని. ‘నువ్వు మగాడివైతే సంపాదించి భార్యాబిడ్డలకు పోషించాలి. అలాంటి మగాడినే నేను ఇష్టపడతాను. నా దృష్టిలో నువ్వు మగాడివే కాదు’ అని ముఖం మీదే చాలా సార్లు తిట్టాను. నా భర్త 63 ఏళ్ల వయసులో కాలం చేశారు’’ అని చెప్పుకొచ్చారు. మరి, కాకినాడ శ్యామల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.