సినిమాల్లో.. చాలా మంది నటులు.. ఏదో ఒక తరహా పాత్రలకు మాత్రమే ఫిక్సయిపోతారు. వేరే జానర్‌లు ట్రై చేయరు. విలన్‌గా చేసిన వ్యక్తి.. అదే రోల్స్‌లో కనిపిస్తాడు. కానీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించడం అంటే మాటలు కాదు. సినిమా అంటే ఎంతో పిచ్చి ఉన్నవారు మాత్రమే.. అలా విభిన్న పాత్రలు పోషించగలరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. సుమారు 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ.. 200 మంది పైచిలుకు దర్శకుల డైరెక్షన్‌లో.. సుమారు 700 వందలకు పైగా చిత్రాల్లో నటించి.. ప్రజలను మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ టూ జూనియర్ వరకు మూడు తరాల హీరోలతో నటించి రికార్డు సృష్టించారు.
రాముడు, కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో.. దుర్యోదనుడు, ఘటోత్కచుడు, యముడు అనగానే.. కైకాల ప్రేక్షకుల మదిలో మెదులుతారు. తన అద్బుతమైన నటనతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. ఫిల్మ్‌నగరలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇక కైకాల జీవితం.. సినిమాల్లో ఆయనకు ఎదురైన అనుభవాల గురించి..
కైకాల సత్యనారాయణ.. 1935, జూలై 25న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో జన్మించారు. గుడ్లవల్లేరులో హైస్కూల్.. విజయవాడ, గుడివాడలో.. ఇంటర్, గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఊహా తెలిసినప్పటి నుంచి ఆయనకు నటన అంటే ఎంతో ఇష్టం. జీవితంలో నటుడిగా గొప్ప స్థాయికి ఎదగాలని ఆశించారు. దాంతో ఇంటర్ చదివే రోజుల్లోనే.. వివిధ నాటక సంస్థల తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. అనేక నాటకాల్లో హీరోగా, విలన్‌గా రాణించారు. ఓ వైపు చదువుతూనే.. మరో వైపు నాటకాల్లో రాణించారు. అలా 1955లో డిగ్రీ పూర్తి చేశారు. కానీ ఉద్యోగం రాలేదు. ఇక అప్పటికే సత్యనారాయణ కుటుంబానికి రాజమండ్రిలో కలప వ్యాపారం ఉండేది. దాంతో కొన్నాళ్లు వ్యాపారాన్ని చూసుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడి సలహా మేరకు.. సినిమాల్లో రాణించేందుకు మద్రాసు వెళ్లారు కైకాల.
ఇక మద్రాస్ వెళ్లగానే ఆయనకు అవకాశాలు రాలేదు. ఎంతో ప్రయత్నం తర్వాత.. ముందుగా ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో.. సహాయ కళా దర్శకుడిగా కైకాల సినీ కెరీర్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత ఆయనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లే.. వచ్చి చేజారింది. కొడుకులు-కోడళ్లు.. అనే సినిమా కోసం.. దర్శక, నిర్మాత ఎల్‌వీ ప్రసాద్.. కైకాలకు స్క్రీన్ టెస్ట్ చేసి.. ఓకే చేశారు. కానీ దురదృష్టవశాత్తు.. ఆ సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. కానీ కైకాల ఏమాత్రం నిరుత్సాహపడకుండా.. తన ప్రయత్నాలు కొనసాగించారు.
ఈ క్రమంలో బీఏ సుబ్బారావు సూచన మేరకు కైకాల.. ప్రముఖ దర్శక, నిర్మాత కేవీ రెడ్డిని కలిశారు. ఆయన కూడా కైకాలకు స్క్రీన్ టెస్ట్ చేశారు కానీ అవకాశం కల్పించలేకపోయారు. అలా కైకాలా చేజారిన సినిమా దొంగ రాముడు. ఆ సినిమాలో కైకాల చేయాల్సిన పాత్ర.. ఆర్. నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు ఆయన పట్టుదల చూసి.. నిర్మాత డీఎల్ నారాయణ.. తన సిపాయి కూతురు.. చిత్రంలో కైకాలకు అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు.
అయితే అదే సమయంలో.. నెలకు మూడు వందల రూపాయలకు గాను.. మూడు ఏళ్ల పాటు అదే సంస్థలో పని చేస్తానని కైకాల ఒప్పుకోవడంతో.. ఆయనకు బయట సంస్థల్లో పని చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇదే సమయంలో కైకాల నాగేశ్వరమ్మను వివామం చేసుకున్నారు.ఇక ఇదే సమయంలో కైకాల నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. కాంట్రాక్ట్ తీరిన తర్వాత.. ఆయనకు అవకాశాలు లేకపోవడంతో.. ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు. చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో.. ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నారు కైకాల. ఆ సమయంలో భార్యాబిడ్డలను తీసుకుని.. నేరుగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు కైకాల. తన పరిస్థితి గురించి చెప్పి.. తిరిగి ఊరేళ్లిపోతున్నాను అని చెప్పారు. ఆ విన్న ఎన్టీఆర్.. కైకాలను కారేక్కించుకుని.. తనతో పాటు తీసుకెళ్లి.. మూడు సినిమాల్లో అవకాశం ఇప్పించారు.
ఆ తర్వాత కైకాలలోని ప్రతిభను గుర్తించిన.. దిగ్గజ దర్శకుడు విఠలాచార్య.. కనకదుర్గ.. పూజా మహిమ సినిమాలో.. సేనాధిపతి పాత్ర ఇచ్చారు. అది ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇక చిన్నా, పెద్దా పాత్రలతో సంబంధం లేకుండా.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని.. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. నిండు హృదయాలు సినిమాల తర్వాత.. కైకాల కెరీర్ దూసుకుపోయింది. ఒక్క ఏడాదిలోనే ఆయన స్టార్‌గా నిలిచారు. ఇక ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు.
ఇక కైకాల తన కెరీర్‌లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సుయోధనుడిగా, భీమునిగా, రావణాసురడిగా, ఘటోత్కచుడిగా, యముడిగా.. ఆయన ప్రేక్షకులు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక యముడి పాత్రలో ఆయన చెప్పిన దుంతత డైలాగ్.. ఇప్పటికి ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతుంది. ఇక ఎస్వీ రంగారావు తర్వాత.. ఆ తరహా పాత్రలకు కైకాల బెస్ట్ చాయిస్‌గా నిలిచారు. ఇక కైకాల నటుడిగానే కాక.. నిర్మాతగా కూడా రాణిచారు.
కైకాల.. సొంతంగా రమా ఫిలిమ్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించి.. గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలను నిర్మించారు. ఇయన ఆయన తన సినీ కెరీర్‌లో.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. ఇక 1994లో బంగారు కుటుంబం సినిమాకుగాను ఆయన నంది అవార్డు గెలుచుకున్నారు. అలానే 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 2017లో కైకాలకు ఫిల్మ్ ఫెయిర్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. అలానే పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది.
కైకాల నటించిన చిత్రాల్లో.. 220 పైచిలుకు చిత్రాలు.. ఏకంగా 100 రోజలు.. 59 సినిమాలు 50 రోజులు ఆడాయి. 10 సినిమాలైతే ఏకంగా ఏడాది పాటు నడిచాయి. కైకాల రాజకీయాల్లో కూడా రాణించారు. 1996లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరఫున ఎన్నికల్లో నిలబడి.. గెలిచారు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో కైకాల చివరి సారిగా కనిపించారు. గతేడాది ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసమయంలో చిరంజీవి.. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కైకాల బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. ఇక వయోభారం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న కైకాల.. అనారోగ్యం కారణంగా.. శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మరణం.. ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.