ఆస్కార్ వేడుక ముగిసిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్కార్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాన్ని ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాటకిగానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటకు ఆస్కార్ రావడంతో.. అంతర్జాతీయ వేదికపై తెలుగు ఖ్యాతి రెపరెపలాడింది. ఈ సినిమా తరఫున సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ స్టేజీ మీదకు వెళ్లి.. అవార్డు అందుకున్నారు. ఆస్కార్ వేడుక ముగిసినా.. మన దగ్గర ఆ ఫీవర్ ఇప్పట్లో వదిలేలా లేదు. ఇక ఆస్కార్ సంబరాలు ముగిసిన రెండో రోజు ఇండియాలో అడుగు పెట్టాడు ఎన్టీఆర్. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌లో మొదటగా ఆయనే ఇండియాకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో జూనియర్‌కి ఘన స్వాగతం పలికారు అభిమానులు.
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి ఓ బహిరంగ ఈవెంట్లో పాల్గొన్నారు ఎన్టీఆర్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన `ధమ్కీ` చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రోజు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచ పటంలో నిలబడింది అంటే.. ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే దానికి రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారకులో.. వీళ్లందరితో పాటు యావత్ తెలుగు చిత్రసీమ, అలాగే భారతీయ చిత్రసీమ కూడా అంతే కారణం. ప్రేక్షక దేవుళ్ళు కూడా అంతే కారణం. వీటన్నింటికి తోడు మాపై మీ అభిమానం ముఖ్యమైన కారణం’’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఆస్కార్స్ వేదికపై చూస్తుంటే… నాకు ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు. ఆ స్టేజి మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. టీవీలో చూసి మీరు ఎంత ఉత్సాహం పొందారో నాకు తెలియదు గానీ… ఈ రెండు కళ్ళతో నేడు ప్రత్యక్షంగా చూడటం మాత్రం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాంటి ఆనందాన్ని మళ్ళీ ఎప్పుడు పొందుతామో తెలియదు. కానీ తప్పకుండా పొందుతాం. ‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారతీయ చిత్రాలు ఇంకా మున్ముందుకు సాగాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను’’ అన్నారు. మళ్ళీ ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడుతుందని, మళ్ళీ మనమంతా ఆనందపడే రోజులు వస్తాయని ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.