ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంతమంది తమపట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని చాలా మంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లే కాదు.. అప్పుడప్పుడు మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని పలువురు నటులు తమ ఆవేదన వెల్లబుచ్చారు.
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఓ రేంజ్ లో కొనసాగింది.. గతంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పపడిన వారిపై సెలబ్రెటీలు ఆరోపణలు చేస్తూ వారికి శిక్షపడేలా చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీమణులు కెరీర్ బిగినింగ్ లో తమపై కొంతమంది ఇండస్ట్రీ వర్గానికి చెందిన వారు లైంగిక వేధింపులకు గురి చేశారని.. కొన్ని సినిమా ఛాన్సులు కూడా రాకుండా చేశారని ఆవేదన వెలిబుచ్చారు. అయితే కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉన్నా సినీ ఇండస్ట్రీలో మాత్రమే తరుచూ వినిపిస్తుంది. సాధారణంగా ఆడవాళ్లే ఎక్కువగా ఇలాంటివి ఫేస్ చేస్తారనుకుంటే ఇటీవల కొంతమంది నటులు సైతం ఆ లైంగిక వేదింపులకు గురయ్యామని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు గతంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ నటుడు జతిన్ సింగ్ జమ్వాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు తెలిపారు. చిన్నిప్పటి నుంచి నేను నటుడిగా మారాలని ఎన్నో కలలు కనేవాడిని.. అదృష్టం కొద్ది నాకు వెంట వెంటనే రెండు షోలు వచ్చాయి.. నా శ్రమకు తగ్గ గుర్తింపు వచ్చిందని సంతోషించాను. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆన్ స్క్రీన్ కి దూరం కావాల్సి వచ్చింది.. దానికి కారణం ఆడీషన్స్ చేసేవాళ్లు నాలో ఉన్న టాలెంట్ ని కాకుండా వేరే ఇంకేదో ఆశించారు. నాతో కాఫీ తాగాలని, నన్ను పర్సనల్ గా కలవాలని కోరారు.. నేను హీరోని అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. మంచి పాత్రల్లో నటించి నా టాలెంట్ నిరూపించుకోవాలనే ఆశపడ్డాను. నా ప్రొఫైల్ చూసి ఆడిషన్స్ కాకుండా నన్ను బయట కలుద్దామా అని కోరేవారు.. ఒకసారి మరీ దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద క్యాస్టింగ్ డైరెక్టర్. ఓటీటీ షోల కోసం నటీనటులను ఎంపిక చేస్తుంటాడు. ఆయన గురించి తెలుసుకొని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రాదేయపడ్డాను. దానికి వాట్సాప్ లో మంచి ఫోటో పంపమని అడిగాడు… అలాగే పంపించాను. ఓకే అంతా బాగుంది.. కాఫీ షాప్ లో కలుద్దాం అని అన్నాడు. అలాగే ఆయన చెప్పిన కాఫీ షాప్ కి వెళ్లాను.. కాఫీ తాగుతూ మాట్లాడాడు.. సడెన్ గా నా తొడలపై చేతులు వేసి నిమిరాడు. పబ్లిక్ లో ఒక్కసారే ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.. సార్ ఇలాంటివి నాకు నచ్చవు అన్నాను.. దానికి ఆయన ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ గట్టిగా నిమిరాడు. వెంటనే నేను అక్కడ నుంచి పారిపోయాను. చాలా కాలం వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేదు.. ఆ సంఘటన తల్చుకొని ఇంట్లో చాలా రోజులు ఏడ్చాను. ఆ డైరెక్టర్ మాట వినకపోవడం వల్ల నాకు ఆ ప్రాజెక్ట్ లో అవకాశం రాలేదు.