క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. తాను కూడా దాని బారిన పడ్డానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సినీ రంగంలో “క్యాస్టింగ్ కౌచ్” అన్న పదం ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఎంతో మంది హీరోయిన్లు, నటీమణులు, సింగర్లు వంటి వారు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ వెల్లడించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచమంతా ఉంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు సెలబ్రిటీలు మీడియా ముఖంగా వెల్లడించారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మరో నటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని.. క్యాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు వెల్లడించారు. జంబలకిడిపంబ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమనికి మొదటి సినిమాతోనే పెద్ద విజయం అందుకున్నారు.
ఆ తరువాత బాపు డైరెక్షన్‌లో వచ్చిన మిస్టర్ పెళ్ళాం ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాకు గాను జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో మదర్ రోల్స్ చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై పలు టీవీ షోస్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఆమని మాట్లాడుతూ.. “క్యాస్టింగ్ కౌచ్” సమస్య ఎప్పటి నుంచో ఉందని.. కానీ ఎవరికీ తెలియదని అన్నారు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా లేదు. దాని వలన క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చునని అన్నారు. ఏ వృత్తిలో అయినా సరే మంచి, చెడు, రెండు ఉంటాయని.. హీరోయిన్స్ గా అది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తమిళంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని ఆమె అన్నారు.
ఓ సినిమాలో స్విమింగ్ పూల్ సీన్ కోసం ఓ దర్శకుడు తనను డ్రెస్ తీసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూడాలని అన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడు చెప్పిన మాటలకు తాను ఒప్పుకోలేదని.. ఇలాంటి వ్యక్తులు కేవలం వాటి కోసమే వస్తారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ చేయనని వారి ముఖం మీదనే చెప్పేసానని ఆమె అన్నారు. మరో డైరెక్టర్ అయితే స్టోరీ గురించి మాట్లాడాలి అంటే ఒప్పుకున్నానని ఆమె అన్నారు. అయితే మేనేజర్ ఫోన్ చేసి.. ఒక్కదానివే రావాలని.. నీతో ఎవరూ రాకూడదని అన్నాడని.. అయితే తాను వెళ్లలేదని ఆమె అన్నారు. ఇలాంటి అనుభవాలు తనకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నామన్నదే పాయింట్ అని.. ఒకరిని తప్పు పట్టడానికి లేదంటూ ఆమని చెప్పుకొచ్చారు. మరి ఆమని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.