సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి తమ సత్తా చాటిన హీరోయిన్స్‌లో శ్రీదేవి ఒకరు. ఆమె కొన్ని దశాబ్ధాల పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. స్టార్‌డమ్ తగ్గిపోయిన తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే 2018, ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో మరణించారు. ఓ పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె తన రూమ్‌లోని బాత్‌టబ్‌లో శవమై దర్శనమిచ్చారు. ఇక, శ్రీదేవికి పెద్ద కూతురు జాన్వీ అంటే ఎంతో ఇష్టం. జాన్వీ కూడా తల్లి శ్రీదేవి అంటే ప్రాణమిస్తుంది. తల్లి చనిపోయి నాలుగేళ్లు దాటినా తరచుగా ఆమె గురించి తలుచుకుంటూ ఉంటుంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన తల్లి శ్రీదేవి గురించి మాట్లాడారు జాన్వీ. తండ్రి బోనీ కపూర్ సిగరెట్ అలవాటు మార్చటానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని వివరించారు. జాన్వీ మాట్లాడుతూ.. ‘‘ అది చాలా ఏళ్ల క్రితం నాటి సంగతి. మేము అప్పుడు జుహులోని ఇంట్లో ఉంటున్నాం. నాన్న బాగా సిగరెట్లు తాగేవారు. నేను ఇంకా సినిమాల్లోకి రాని సమయం అది. ఖుషీ, నేను నాన్న సిగరెట్ ప్యాకెట్లను వెతికి మరీ నాశనం చేసేవాళ్లం. కానీ, ఏదీ పనిచేయలేదు. అమ్మ కూడా నాన్నతో ఇదే విషమై పోడ్లాడేది. ఈ నేపథ్యంలోనే అమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
నాన్న సిగరెట్లు మానేసే వరకు మాంసం ముట్టుకోనని శపథం చేసింది. ‘నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్. మాంసం కూడా తినకపోతే ఇబ్బంది’ అని డాక్టర్లు హెచ్చరించారు. అయినా అమ్మ వినలేదు. నాన్న కూడా ఎంతో చెప్పి చూశాడు. అమ్మ వినలేదు. చివరకు ఈ మధ్య ‘అప్పుడు చేయలేకపోయా.. ఇప్పుడు చేస్తా’ అని నాన్న అంటున్నారు ’’ అని చెప్పుకొచ్చారు. కాగా, జాన్వీ కపూర్ తాజాగా గుడ్ లక్ జర్రీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ‘కొలమావు కోగిల’ రీమేక్‌గా తెరకెక్కింది.