చిత్రం: ‘జగమే తంత్రం’
ఈ మధ్య కాలంలో మంచి చిత్రాలతో గొప్ప విజయాలను అందుకున్న హీరో ధనుష్. పిజ్జా, జిగర్ తండ వంటి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జగమే తంత్రం. అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ అయిన జగమే తంత్రం మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
సురుళి (ధనుష్) మధురై ప్రాంతంలో ఒక చోటా రౌడీ. సెటిల్మెంట్లు చేసుకునే అతను.. అనుకోకుండా ఒక హత్య చేస్తాడు. దీంతో.., నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా సురుళి లండన్ చేరుకుంటాడు. అక్కడ పీటర్ గ్యాంగ్ లో చేరతాడు సురుళి. అక్కడ నుండి మరో డాన్ శివదాస్ తో సురుళి తలపడాల్సి వస్తుంది. శివదాస్ పై సురుళి పై చేయి సాధించినా.., దాని వల్లే సురుళి జీవితం ప్రమాదకరంగా తయారు అవుతుంది. అలాంటి పరిస్థితిల్లో సురుళి ఏం చేశాడన్నది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ కథ చూస్తున్నంత సేపు మనసులో “కబాలి” మూవీ ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఇండియా నుండి విదేశాలకి వెళ్లిన ఒక హీరో. అనుకోకుండా డాన్ అయిపోతాడు. అక్కడే లోకల్ కూలీలుగా పని చేస్తున్న తన దేశస్థులకి అండగా నిలుస్తాడు. మొత్తం “కబాలి” కథే. దీన్నే కాస్త స్టైలిష్ గా ప్రజెంట్ చేసి.., పాన్ ఇండియా హిట్ కొట్టేద్దాం అనుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. కానీ.., మేకింగ్ పై పెట్టిన శ్రద్ద, స్క్రిప్ట్ పై పెట్టకపోవడంతో జగమే తంత్రంలో జనాన్ని ఆకట్టుకునే ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సమస్యతో ముడిపడ్డ ఓ కథని చెప్తున్నప్పుడు ఆ పెయిన్ ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ పడాల్సిన అవసరం ఉంటుంది. “కేజీఎఫ్” విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యింది కూడా ఇక్కడే. ఉదాహరణకి ఆ సినిమాలో రాఖీ నేరుగా వెళ్ళిపోయి గరుడని చంపేసి.., కేజీఎఫ్ ని సాధించి ఉంటే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి ఉండేది. కానీ.., దర్శకుడు అక్కడి మనుషుల పెయిన్ నుండి హీరోయిజాన్ని పుట్టించాడు. కాబట్టే కేజీఎఫ్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. కానీ.., జగమే తంత్రంలో ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. దర్శకుడు కేవలం ధనుష్ నటనపైనే డిపెండ్ అయిపోయాడు. కథా, కథనంలో దమ్ము లేకపోవడంతో ధనుష్ ఎంత కష్టపడ్డా దానికి ప్రయోజనం లేకుండా పోయింది.
నటీనటుల పనితీరు:
నటనలో ధనుష్ కష్టానికి వంకలు పెట్టలేము. ఆ స్థాయిలో ధనుష్ నటన సాగింది. తనకి అంతగా సూట్ అవ్వని ఎలివేషన్స్ షాట్స్ లో కూడా ధనుష్ చాలా ప్రత్యేకంగా కనిపించాడు. ఐశ్వర్యా లక్ష్మి తన పాత్రకి ప్రాణం పోసింది. ఇక మలయాళ నటుడు జోజు జోసెఫ్.. కీలకమైన శివదాస్ పాత్రలో రాణించాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
సాంకేతిక విభాగం:
జగమే తంత్రం విషయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎక్కడైనా సూపర్ సక్సెస్ అయ్యాడంటే అది కేవలం మేకింగ్ విషయంలోనే అని చెప్పుకోవాలి. టెక్నీషియన్స్ అందరి దగ్గర నుండి అతడు టాప్ క్లాస్ వర్క్ రాబట్టుకున్నాడు. కాకుంటే.., ఈ సినిమాకి పాటలు పెద్ద మైనస్. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం సంతోష్ నారాయణన్ మెప్పించాడు. శ్రేయస్ కృష్ణ ఛాయాగ్రహణం అదిరిపోయింది. ఇక నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. నిజానికి కార్తీక్ సుబ్బరాజ్ మూవీ అంటే ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే ఆశిస్తారు. కానీ.., ఈ సినిమాకి మాత్రం కార్తీక్ సుబ్బరాజ్ నేరేషనే మైనస్ గా నిలవడం విశేషం.
చివరి మాట: “జగమే తంత్రం” ఇంకాస్త జాగ్రత్తగా తీసుండాల్సిన సినిమా.
రేటింగ్: 2.75 /5