ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఆయన ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమయ్యారు. కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో కూడా కనిపించారు. గరుడ పురాణంతో కొన్ని రోజులు పాటు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూడా అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో ఆయన అసలు కనిపించడమే మానేశారు. ఈ క్రమంలో తాజాగా శివాజీ ‘అల్లూరి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల్లూరి’. సోమవారం (జూలై 04) అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ‘‘అల్లూరి సినిమా నిర్మాత గోపి (బెక్కెం వేణుగోపాల్) చాలామందిని పరిచయం చేశారు కానీ.. నేను గోపీని పరిచయం చేశానని చాలా గర్వంగా చెప్తాను. గోపీ సినిమా మీద, సూపర్ స్టార్ క్రిష్ణగారి మీద అభిమానంతో అచ్చెంపేట నుంచి హైదరాబాద్ వచ్చాడు. అనుకోకుండా ఓ చీకటి రోజున నన్ను కలిశాడు.. నేను కూడా ఆరోజున చీకటిలోనే ఉన్నాం.. చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. నాకు ప్రతికథ చెప్తాడు. అలా నాకు చెప్పిన కథల్లో కొన్ని వద్దన్నాను. అలా నేను వద్దని చెప్పిన కథని చేశాడు.. ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది’’ అని తెలిపాడు.
‘‘ఇప్పుడు నాకు ‘అల్లూరి’ కథను చెప్పాడు.. ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని ఈ సినిమా చేయొచ్చని చెప్పాను. అంత అద్భుతంగా ఈ సినిమా కథను తయారు చేశారు దర్శకుడు. విష్ణు సినిమా చేస్తున్నానంటే.. కొత్తదనం ఆశిస్తారు.. రేపటి రోజున ఈ సినిమా చూసినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుంది. పోలీస్ కథలు చాలా వరకూ సక్సెస్ అవుతాయి. మనల్ని మనం సినిమాలో ఊహించుకుంటాం కాబట్టే.. సినిమాలు ఇంకా బతికి ఉన్నాయి.. బతికే ఉంటాయి. ఈ అల్లూరి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది’’ అన్నాడు.
‘‘సమజాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళ్లాల్సింది పోయి.. పాతాళానికి తొక్కేస్తున్నారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ.. అల్లూరి పేరు గుర్తుకు వచ్చినప్పుడు ఇలాంటివి గుర్తుకు వస్తాయి. ఇలాంటి భావనలతోనే నేను సినిమాలకు దూరం అయ్యారు. నా కెరియర్‌లో చివరి సినిమా ‘బూచమ్మా బూచాడు’.. నాకు కెరియర్ ఉన్నా కూడా.. పాలెం బస్సు సంఘటన నన్ను సినిమా నుంచి దూరంగా తీసుకుని వెళ్లింది. హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకుని ఉంటే.. ఎంత వరస్ట్ సినిమాలు తీసినా.. తక్కువలో తక్కువ 10-15 సినిమాలు తీసేవాడిని. కానీ నేను వాటి కోసం ఆలోచించలేదు. ఈనాటికీ కూడా మన భారతదేశం పాలెం బస్సు దగ్గరే ఆగిపోయింది. ఇది మారాలి.. అల్లూరిని ఫొటోలలో చూసుకోవడం కాదు.. మీ పిల్లలకు ఏం ఇవ్వాలో అల్లూరి చూసి నేర్చుకోవాలి.. మనలో స్వార్ధం పెరిగిపోతుంది. ఈ అల్లూరి సినిమా ఎంతో మందికి కనువిప్పు కావాలని కోరుతున్నా’’ అని చెప్పుకొచ్చాడు శివాజీ. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.