చిత్ర పరిశ్రమలో ఒక సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుంచి విడుదల అయ్యే వరకు అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. షూటింగ్ అంతా సవ్యంగా జరిగి రిలీజ్ వచ్చాక కొన్ని సినిమాలకు థియేటర్లు దొరకవు. దాంతో వారు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదీ కాక పెద్ద పెద్ద హీరోలకే పరిశ్రమలో ఒక్కోసారి థియేటర్లు దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్నగాక మెున్న యువ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ-2 మూవీకి థియేటర్లు ఇవ్వమన్నారని నిఖిల్ సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఆవేదనే వ్యక్తం చేశాడు ఓ యంగ్ హీరో. ఇండస్ట్రీలో ఉన్న వాడు లేని వాడిని తొక్కుతున్నాడు. ఇది మాఫియా కంటే డేంజర్ అని ఆ యంగ్ హీరో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన ఆవేదనను వెల్లడించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
“ఇండస్ట్రీలో ఈ విధానానికి మాఫియా అని పేరు పెట్టోచ్చో.. లేక మరో పేరేదైనా పెట్టోచ్చో నాకు తెలీదు. మీకు అర్ధం అయ్యే రీతిలో చెప్పాలంటే.. పరిశ్రమలో డబ్బున్నవాడు లేని వాడిని తొక్కున్నాడు” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు యంగ్ హీరో త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్. సిరి క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ దేశం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 18న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ..”మాతో ప్రేమ దేశం మూవీ చేయడానికి విజయవాడకు చెందిన ప్రొడ్యూసర్ వచ్చాడు. నాకు, హీరోయిన్ మేఘా ఆకాశ్ కు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమా ను ఆసేస్తున్నాను.. మా అడ్వాన్స్ లు మాకు ఇచ్చేయండి అని చెప్పారు. అసలు మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మా యాక్టింగ్ చూసి మణిశర్మగారు మెచ్చుకున్నారు. ఈ మూవీకి మణిగారే మ్యూజిక్ డైరెక్టర్. ఇండస్ట్రీలో రాజకీయాలు జరుగుతాయని తెలుసుగానీ మరీ ఇంతలా బెదిరింపులకు దిగుతారని తెలీదని” హీరో త్రిగుణ్ అన్నాడు.
మీరు బయట నుంచి వచ్చి సినిమాలు చేస్తారా? అలా వస్తే మేం ఎలా షూటింగ్ జరగనిస్తాం. మీ ఫైనాన్స్ ను క్యాన్సిల్ చేసి, మీ సినిమాకు థియేటర్లు దొరక్కుండా చేస్తామని బెదిరించినట్లు త్రిగుణ్ ఆరోపించాడు. అదీ కాక సినిమాను ఓటీటీకి అమ్మకుండా అడ్డుకుంటామని వారు చెప్పినట్లు త్రిగుణ్ పేర్కొన్నాడు. పబ్లిసిటీ చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని వాపోయాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నా దగ్గర కోట్లకు కోట్లు డబ్బులు ఎలా వస్తాయని బాధపడ్డాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ సినిమాను ధైర్యంగా పూర్తి చేశామని తెలిపాడు. ప్రేమ దేశం కథ నచ్చి ఏకంగా నలుగురు నిర్మాతలు ముందుకు వచ్చారని ఈ సందర్బంగా వెల్లడించాడు త్రిగుణ్. మెున్న నిఖిల్ వివాదం మర్చిపోక ముందు మరో యువ నటుడు ఇలా థియేటర్లు ఇవ్వడం లేదని ఆరోపించడం ఇండస్ట్రీకి మంచిది కాదని సినీ పెద్దలు అంటున్నారు. చిన్న చిత్రాలు వస్తుంటేనే పరిశ్రమలో ప్రతీ ఒక్కరికి పని దొరికి ఇండస్ట్రీ ముందుకెళ్తుందని సినీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.