”మైడియర్ ఫ్రెండ్ నువ్వు నీరులా ప్రవహించు.. నీరులా ఉండు” నాకు 10వేల కిక్కులు తెలిసినవాడు అంటే భయం లేదు.. కానీ ఒకే కిక్కును 10 వేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం” ఈ మాటలు వినగానే మనకు గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు బ్రూస్ లీ. అప్పటి వరకు మూస పద్ధతిలో కొనసాగుతున్న హాలీవుడ్ యాక్షన్ సీన్స్ కు ఓ కొత్త ఒరవడిని నేర్పాడు బ్రూస్ లీ. మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ ప్రసిద్ది పొందాడు. అయితే చాలా మందికి బ్రూస్ లీ ఓ మార్షల్ ఆర్ట్స్ యోధుడిగానే తెలుసు కానీ అతడిలో ఓ ఫిలాసఫర్ ఉన్నాడని చాలా మందికి తెలీదు. అవును బ్రూస్ లీ ఓ గొప్ప ఫిలాసఫర్.. అని అతడి మాటలను బట్టే అర్దం చేసుకోవచ్చు. అయితే అతి చిన్న వయసులోనే (32 ఏళ్ల) బ్రూస్ లీ ఆకస్మిక మరణం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక అతడి మరణంపై ఎన్నో సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి వార్తల్లో నిలిచింది బ్రూస్ లీ మరణం. లీ మరణించిన 50 సంవత్సరాల తర్వాత అతడి మరణంపై వైద్యులు విచారణ దావా వేస్తుండటం సంచలనంగా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బ్రూస్ లీ.. అతి చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏ హీరోకి రానీ క్రేజ్ ను సంపాందించుకున్నాడు. సుప్రసిద్ద మార్షల్ కళలో ఆరితేరి వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటు హాంకాంగ్.. అటు హాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్న క్రమంలో 32 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా మరణించాడు బ్రూస్ లీ. అప్పట్లో ఇతడి మరణం ఓ సంచలనం. బ్రూస్ లీని అతడి ప్రత్యర్దులే విషం ఇచ్చి చంపారని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్టుల్లో మాత్రం మెదడు వాపు వ్యాధితో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మళ్లీ 50 సంవత్సరాల తర్వాత అప్పటి సాక్ష్యాలను వైద్య పరిశోధకులు పరిశీలించారు. పోస్ట్ మార్టంలో చెప్పిన నివేదికలోని కారణంతో కాకుండా బ్రూస్ లీ మరో కారణంతో మరణించాడని వారు చెబుతున్నారు. ప్రఖ్యాత క్లినికల్ కిడ్నీ జర్నల్ లో ప్రచూరించబడిన ఓ వ్యాసం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ జర్నల్ లో “బ్రూస్ లీ బాడీ నుంచి అదనపు నీటిని విసర్జించడంలో కిడ్నీఫెయిల్ కావడంతోనే బ్రూస్ లీ మరణించాడు. దాని కారణంగానే లీ హైపోనాట్రేమియా సెరిబ్రల్ ఎడెమా (మెదడు వాపు) వ్యాధి కూడా బ్రూస్ లీకి వచ్చింది. అదీ కాక మూత్రం ద్వారా నీటిని విసర్జించకపోతే.. గంటల్లో వ్యక్తి మరణించే అవకాశం ఉంది. బ్రూస్ లీ ఇదే కారణం చేత మరణించి ఉండవచ్చని” ప్రఖ్యాత జర్నల్ కథనంలో రాసుకొచ్చారు. అయితే బ్రూస్ లీ ఎక్కువగా గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఉపయోగించడం మూలాన.. దాహాన్ని మరింతగా పెంచుతాయి. అందుకే లీ ఎక్కువగా నీరు తీసుకుండే వాడు. నీరు ఎక్కువగా తీసుకోవడమే అతడి మరణానికి కారణం అయ్యిందని నిపుణులు వెల్లడించారు. ఈ విచారణ పూర్తి అయితేగానీ మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఓ గొప్ప నటుడినే కాక అంతకంటే గొప్ప ఫిలాసఫర్ ను ప్రపంచం కోల్పొయిందనే చెప్పాలి.