వంటలక్క - డాక్టర్ బాబు క్యారెక్టర్లకి తెలుగు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో తెలిసిందే. వీరిద్దర్నీ తమ ఇంట్లో మనుషుల్లా ఓన్ చేసేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సీరియళ్లల్లో ‘కార్తీక దీపం’ ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది.
మిగతా భాషల సంగతి పక్కన పెడితే సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు వంటి వాటిని మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారంటే ఇక వాటికి తిరుగుండదు. మన వాళ్లకి నచ్చితే చాలు.. భాష, ప్రాంతం లాంటివేం చూడరు. ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు అక్కడ కంటే మన దగ్గరే ఘన విజయాలు సాధించి, కోట్లాది రూపాయలు వసూలు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇక టీవీ సీరియళ్ల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ సీరియల్స్ టెలికాస్ట్ అవుతుంటే పనులన్నీ పక్కన పెట్టేసి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు. నచ్చిందంటే నెత్తిన పెట్టేసుకుంటారు. అలా విపరీతమైన ఆదరణ దక్కించున్న వాటిలో ‘కార్తీక దీపం’ సీరియల్ కూడా ఒకటి. ఈ ధారావాహికకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోని వంటలక్క – డాక్టర్ బాబు క్యారెక్టర్లకి ఎంతలా కనెక్ట్ అయ్యారో తెలిసిందే. వీరిద్దర్నీ తమ ఇంట్లో మనుషుల్లా ఓన్ చేసేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సీరియళ్లల్లో ‘కార్తీక దీపం’ ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది కూడా.
సంవత్సరాల తరబడి ప్రసారం చేసిన నాటికల్లో ప్రేక్షకాదరణ పొందినవి ఎన్ని ఉన్నా కానీ ‘కార్తీక దీపం’ ది మాత్రం ప్రత్యేకమైన స్థానం. మహిళా మణులను అలరిస్తూనే, అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన డైలీ సీరియల్‌గా రికార్డ్ సృష్టించింది. అయితే ‘కార్తీక దీపం 2’ గురించి కొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా డాక్టర్ బాబు పాత్రధారి నిరుపమ్ పరిటాల ఓ ఇంటర్వూలో దీని గురించి క్లారిటీ ఇచ్చాడు. గతేడాది ఫిబ్రవరిలోనే ‘కార్తీక దీపం’ కి ఎండ్ కార్డ్ వేసేశారు. దీంతో ఈ సీరియల్ వీరాభిమానులు బాగా హర్ట్ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత పున:ప్రసారం చేయడంతో ఫుల్ ఖుష్ అయ్యారు. కట్ చేస్తే, రెండోసారి ప్రసారం చేసినప్పుడు అంతగా క్లిక్ అవలేదు. దీంతో పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ‘రాధకు నీవేరా’ సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు ‘కార్తీక దీపం’ సీక్వెల్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా జనాలు వంటలక్క గురించి అడుగుతుంటారు. పేరు మర్చిపోయి నన్ను డాక్టర్ బాబు అనే అంటుంటారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే ‘కార్తీక దీపం’ సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకి వెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. తను నవ్వి ఊరుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ‘కార్తీక దీపం’ కి కొనసాగింపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి కథ కుదరాలి. అన్నీ కుదిరితేనే సీక్వెల్ చేయాలి. లేదంటే టచ్ చెయ్యకపోవడమే బెటర్. కానీ మా ఇద్దరి కాంబినేషన్లో మరో సీరియల్ చెయ్యొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చాడు డాక్టర్ బాబు. స్వయంగా నిరుపమ్ ‘కార్తీక దీపం’కి కొనసాగింపుగా సీక్వెల్ ఉండదని చెప్పడంతో సీరియల్ ప్రేక్షకాభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.