దర్శకుడు శివ నాగు.. నటుడు సుమన్ పై చేసిన కామెంట్లపై క్షమాపణ చెప్పారు. ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా జరిగిపోయిందని అన్నారు. సుమన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
తెలుగు చలన చిత్ర దర్శకుడు శివ నాగు ప్రముఖ నటుడు సుమన్‌పై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే సుమన్ డబ్బులు అడిగారని శివ నాగు ఆరోపించారు. డబ్బులిచ్చి ఆయన్ను ఫంక్షన్‌కు పిలిపించుకుని పొగడాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం చిన్న సినిమాకు ఎవ్వరూ సహాయం చేయటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుమన్ తీరు తనను బాధించిందని అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ‘నట రత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివ నాగు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏమైందో ఏమో కానీ, శివ నాగు.. సుమన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పారు.
తాజాగా, ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను గతంలో సుమన్ గారు హీరోగా మూడు సినిమాలు చేశాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా ఇంట్లో వారందరం ఆయన్ని అభిమానిస్తాము. మేము సొంతంగా ఓ సినిమా చేశాము కాబట్టి.. సుమన్ లాంటి లెజెండరీ హీరో వస్తే బాగుంటుందని భావించాము. మా సినిమా గురించి ఓ నాలుగు మాటలు మాట్లాడతారని అనుకున్నాను. నేను ఆయనకు సన్మానం కూడా చేద్దామని అనుకున్నాను. అందుకే ఆయన్ని పిలిచాను. సుమన్ గారి మేకప్ మ్యాన్ వెంకట్రావ్ మాట్లాడిన విధానం వల్ల.. నేను విన్న విధానం వల్ల ఏదో తప్పు జరిగిపోయింది. దానికి తోడు నేను ఆడియో టెన్షన్‌లో ఉండిపోయాను.
పది రోజుల క్రితమే సుమన్ గారికి,. వెంకట్రావు గారికి చెప్పాను. ఏది ఏమైనప్పటికి మిస్ కమ్యూనికేషన్ అయినందుకు ఆయనకు మనస్పూర్తిగా సారీ చెబుతున్నాను. ఇంతకు ముందు కూడా సారీ చెప్పాను. ఇప్పుడు మరోసారి హార్ట్‌కు టచ్ అయ్యే విధంగా సారీ చెబుతున్నాను. ఈ సమస్యను ఇంతటితో ఆపాలి. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇది సొంత సినిమా.. సుమన్ మీద ఉన్న అభిమానంతోనే పిలిచానని అర్థం చేసుకోండి. సుమన్ గారూ మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు గ్రేట్ హీరో. మీకు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు’’ అని అన్నారు. మరి, దర్శకుడు శివ నాగు చెప్పిన సారీతో సుమన్ శాంతిస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.