వివాదాలను ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ. ఆయన కాలు కదిపినా.. కాంట్రవర్సీనే అవుతుంది. విషయాలను వివాదాలుగా మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి వివాదం కాదు గానీ, పొగడ్తలతో వైరలవుతున్నాడు. ఇటీవల ‘డియర్ మేఘ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన వర్మ హీరోయిన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
హీరోయిన్ మేఘ ఆకాశ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ’40 ఏళ్ల క్రితం నాకు మేఘ లాంటి అమ్మాయి కనిపిస్తే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు’ అంటూ తనదైన స్టైల్లో వర్మ పంచ్‌లు కురిపించారు. మేఘ చాలా స్వీట్ అని తనని కలిసిన వారికి షుగర్ వ్యాధి వస్తుందని చలోక్తులు విసిరాడు. హీరో అదిత్ని కూడా అలాగే పొగిడితే వర్మను మరోలా అనుకుంటారంటూ జోక్ చేశాడు. అదిత్ మంచి యాక్టర్ అంటూ తనతో త్వరలో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. ఇక సినిమా పాటలు, ట్రైలర్ అన్నీ బాగున్నాయంటూ వర్మ పేర్కొన్నాడు.
ఇక, ఇయానా సుల్తానాతో డాన్స్ చేసి, వర్మ ఆమె కాళ్లు పట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె అందానికి పొగడ్తగా కాళ్లపై పడినట్లు వర్మ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న డియర్ మేఘ సినిమాకి సుశాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అదిత్, మేఘ ఆకాశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది.