తెలుగు చలన చిత్ర నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం బోరబండలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.
కష్టాలు తట్టుకొని జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్లే వారు అరుదుగా ఉంటారు. అయితే.. అసలు కష్టం మనం సక్సెస్ సాధించిన తర్వాతే మొదలవుతుందని ఎవరూ కూడా ఊహించరు. అందుకే అత్యున్నత స్థితిలో ఉన్నవారు కూడా అంచనాలు అందుకోలేక అమాంతం కిందకి పడిపోతూ ఉంటారు. గెలవడానికి ఆటిట్యూడ్ చాలా ముఖ్యం. కానీ ఒక్కసారి విజయం నీ వశమైన తర్వాత తర్వాత “ఎవరేమనుకున్నా పర్లేదు నేను ఇలాగే ఉంటాను” అనే వైఖరితో ఉంటే మాత్రం ఈ సమాజం నిన్ను కిందకు లాగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పరిస్థితి కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తన ఆటిట్యూడ్ తో గొప్ప స్థితిలోకి వెళ్లిన మాస్టర్.. చివరికి అదే ఆటిట్యూడ్ అతన్ని ఒంటరివాడిని చేసింది. రాకేష్ మాస్టర్ జీవితంలో వివాదాలే కాదు.. నలుగురికీ స్పూర్తి నిచ్చే కోణాలు ఎన్నో ఉన్నాయి.
1968లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో రాకేష్ మాస్టర్ జన్మించారు. మొత్తం 7 గురు సంతానంలో రాకేష్ మాస్టర్ ఒకరు. కుటుంబం పెద్దది కావడంతో పోషణ చాలా కష్టంగా ఉండేది. పైగా వీరికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అనేక కష్టాల మధ్య రాకేష్ మాస్టర్ జీవితం మొదలైంది. చిన్నప్పటినుంచి ముక్కుసూటిగా ఉండే మాస్టర్.. తన ఫ్యామిలీని బయటివారు ఏమన్నా అంటే.. వారి మీద గొడవకి వెళ్ళేవాడు. ఇక స్కూల్ కి పంపిస్తే చదువు మీద పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. దీంతో చదువు తన వల్ల కాదని తల్లితో కలిసి పని చేసేవాడు. అలా చిన్నగా కష్టపడి వారి కంటూ ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. అయితే చదువు మీద ఆసక్తి లేని రాకేష్ మాస్టర్ కి డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఎక్కడ మ్యూజిక్ వినిపించినా.. వెళ్లి డ్యాన్స్ వేసేవాడు. ఆఖరికి శవాలను అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న సరే వెళ్లి ఆ డప్పుల చప్పుడికి తగ్గట్లుగా డ్యాన్స్ వేసేవాడు.
కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. ఫైటింగ్ అంటే కూడా మాస్టర్ కి పిచ్చి. బ్రూస్లీకి పెద్ద అభిమాని అయిన రాకేష్ మాస్టర్.. ఆ ఊరిలో ఒక గురువు దగ్గర కరాటేతో పాటు డ్యాన్స్ లోనూ ట్రైనింగ్ మంచి ప్రావీణ్యం సంపాదించాడు. రాను రాను మాస్టర్ కి డ్యాన్స్ మీద పిచ్చి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో రూపాయి లేకుండానే టికెట్ తీసుకోకుండా చెన్నై ట్రైన్ ఎక్కాడు. అయితే అక్కడ కొన్ని రోజులు ప్లాట్ ఫామ్ మీద పడుకున్న మాస్టర్.. చాలానే కష్టాలు పడ్డాడు. ఇక చేసేదేమి లేక మళ్ళీ ఊరెళ్ళిపోయాడు. ఊరికి తిరిగి వచ్చిన మాస్టర్ అక్కడ ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టి అందరికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ డ్యాన్స్ స్కూల్ కి మంచి పేరు రావడంతో మాస్టర్ ఆర్ధికంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగాడు. ఇక చేతిలో డబ్బులు ఉండడంతో మరోసారి చెన్నై ట్రైన్ ఎక్కి ఈ సారి ఎలాగైనా తాను అనుకున్న పని చేయాలనుకున్న పట్టుదలతో వెళ్ళాడు.
చెన్నైలో అవకాశాల కోసం తీరుతున్న సమయంలో మాస్టర్ కి సుధా అనే మేనేజర్‌తో పరిచయం అయింది. ఈమె సహాయంతోనే రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని కలిశారు. ముక్కు రాజు మాస్టర్ అప్పట్లో పెద్ద కొరియోగ్రాఫర్. ఇతని దగ్గర మొత్తం 14 మంది డ్యాన్సర్లు ఉండేవారు. ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని కలిశాడో అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాగర సంగమంలో.. కమల్ హాసన్ వేసిన స్టెప్స్ ని వేసి ముక్కు రాజు మాస్టర్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆయన దగ్గర ఉన్న 14 మంది డ్యాన్సర్లకు రాకేష్ మాస్టరుని హెడ్ గా నియమించారు. అయితే ఇక్కడ రాకేష్ మాస్టర్ సక్సెస్‌ను తట్టుకోలేక ఆ 14 మంది డ్యాన్సర్లు పగ పట్టారు. అయినా సరే తన యాటిట్యూడ్ ని మార్చుకోకుండా వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తర్వాత గురువు చెప్పిన సలహాతో అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన మాస్టర్.. డ్యాన్స్ స్కూల్ పెట్టి బాగా ఫేమస్ అయ్యాడు.
ఇక్కడ నుంచి రాకేష్ మాస్టర్ దశ తిరిగిపోయింది. అప్పట్లో సినిమాల్లో రాణించాలంటే హీరో, హీరోయిన్లకి డ్యాన్స్ తప్పనిసరి. ఈ కారణంగానే చాలా మంది సినిమాల్లోకి వెళ్లాలనుకునేవారు రాకేష్ మాస్టర్ దగ్గరకి వచ్చి డ్యాన్స్ నేర్చుకునేవారు. ఈ లిస్టులో ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్, వేణు తొట్టెం పూడి, హీరోయిన్ ప్రత్యూష కూడా ఉన్నారు. అంతే కాదు ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా ఈ డ్యాన్స్ స్కూల్ లో రాకేష్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవారే. ఇక రాకేష్ మాస్టర్ డ్యాన్స్ వలన వేణుకి స్వయంవరం సినిమాలో హీరోగా అవకాశమొచ్చింది. ఈ సినిమా వేణుకి మంచి గుర్తింపు తీసుకురావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో గురు దక్షిణగా తన తర్వాత సినిమా ‘చిరునవ్వు’లో వేణు రాకేష్ మాస్టర్ కి ఛాన్స్ ఇప్పించాడు. ఇక ఈ సినిమాలో చేసిన “నిన్నలా మొన్నలా” అనే పాటకి 60 మందితో కొరియోగ్రాఫ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన తొలి సినిమా ఇదే.
చిరునవ్వుతో వచ్చిన సక్సెస్ తో చాలా సినిమాలు రాకేష్ మాస్టర్ దగ్గరకి క్యూ కట్టాయి. తమిళ కొరియోగ్రాఫర్స్ సినిమా ఏలుతున్న ఆ తరుణంలో మాస్టర్ మన తెలుగు వారి సత్తా చూపించాడు. మనసిచ్చి చూడు, యువరాజ్, దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలు చేసి టాప్ కొరియోగ్రాఫ్ గా నిలిచాడు. ఈ దశలోనే సక్సెస్ అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అయితే కెరీర్ అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో కొంత మంది డైరెక్టర్లకి, రాకేష్ మాస్టర్ కి మధ్య వివాదాలు వచ్చాయి. ఇష్టం లేకుండానే ఆ సినిమాలు పూర్తి చేసాడు. ఈ లిస్టులో రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశి కూడా ఉన్నారు. అయితే ఒకరోజు డ్యాన్స్ స్కూల్ లో ఆడిషన్స్ జరపకుండా ఇష్టం వచ్చిన వారికి కార్డులు ఇస్తున్నారని తెలుసుకున్న రాకేష్ మాస్టర్.. ఈ తప్పుని తీవ్రంగా ఖండించాడు. దీంతో కొంతమంది రాకేష్ మాస్టర్ ని టార్గెట్ చేసి అతనికి కార్డు తొలిగించారు. ఇందులో ఆయన శిష్యులు కూడా ఉన్నారు.
అయితే ప్రస్తుతం టాప్ హీరోలకి కొరియోగ్రాఫ్ చేస్తున్న శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏమైందో తెలియదుకాని వీరిద్దరి మధ్య క్రమంగా దూరం పెరిగిపోయింది. ఇక ఢీ షో లో కొరియోగ్రాఫ్ గా చేస్తున్న రాకేష్ మాస్టర్ ఒక రోజు ప్రభుదేవా మాస్టర్ జడ్జ్ గా రావడాన్ని తప్పు పట్టాడు. తెలుగులో డ్యాన్సర్లు కరువవుతున్నారని బహిరంగాగానే వాపోయాడు. దీంతో క్రమంగా రాకేష్ మాస్టర్ కి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇటీవలే కరోనా టైంలో రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. తన విచిత్రమైన మాటలతో, సినిమా ప్రముఖుల్ని సైతం బహిరంగగానే విమర్శించడం మాస్టర్ పేరుని దిగజార్చింది. ఒకప్పుడు కొరియోగ్రాఫర్‌గా మంచి విజయాలను సాధించినటప్పటికీ.. మాస్టర్ సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడో ఎవ్వరికి అర్ధం కాలేదు. తాగుడికి బానిసగా మారిన మాస్టర్.. తాజాగా హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించాడు. చివరి రోజుల్లో మాస్టర్ ని అందరూ అసహ్యించుకున్నా.. అతను గతంలో మన తెలుగు ఇండస్ట్రీకి తెచ్చిన పేరు మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది.