టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకొని.. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఇండస్ట్రీపై, మెగా హీరోలపై విమర్శలు గుప్పించాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్లో అండ ఉందనుకొని విర్రవీగి మెగా హీరోలపై నోరు పారేసుకున్నాను.. ఆ తర్వాత రోడ్డు పాలయ్యాను.. మెగా హీరోలు క్షమించండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
తాజా వీడియోలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల నుండి మీతో మనసు విప్పి మాట్లాడని.. ప్రజలకు చేరువ కావాలని మదన పడుతున్నాను.ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే.. నేను ఆర్ధికంగా, సినిమాల పరంగా చాలా నష్టపోయాను. నేను చేయాల్సిన సినిమాలు చేయలేకపోయాను. నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయడం లేదు. రోల్స్ ఇవ్వడం లేదు. ఇది వాస్తవం. నాలాంటి వాడికి రాజకీయాలు పనికి రావు. ముక్కుసూటిగా మాట్లాడేవాడికి పార్టీ అన్నా సపోర్ట్ చేయాలి లేదంటే వ్యక్తులైనా సపోర్ట్ చేయాలి. పార్టీ కోసం గొడ్డులా కష్టపడి పనిచేశా. చివరికి వాళ్లు తీసుకునే నిర్ణయాలు వాళ్లు తీసుకున్నారు. నాకు చాలా గొప్ప గుణపాఠం నేర్పించారు. నేను ఇప్పుడు చెప్తున్న మాటలు ఎవరి బలవంతంతోనే చెప్తున్నవి కాదు.. ఆత్మపరిశీలన చేసుకుని చెప్తున్న మాటలు.
అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అసలు నాకు ఎందుకు ఉంటుంది అహంకారం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. నేను వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న టైంలో కూడా మహానుభావుడు చిరంజీవి గారు నాకు ‘సైరా’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అదీ ఆయన గొప్పతనానికి నిదర్శనం. అప్పట్లో నేను విర్రవీగిన తనంతో ఓ మాట మాట్లాడేశా.. ఇండస్ట్రీలో పెద్దలు ఎవరూ సీఎం జగన్ గారి దగ్గరకు వెళ్లలేదు అని.. అలాంటిది ఇప్పుడు పెద్దలందరూ ఒక్కటయ్యారు. పృథ్విరాజ్ ఒంటరయ్యాడు.
ఇది చూస్తుంటే నాకు చాలా హాస్యం అనిపించింది. నా డైలాగ్ నాకే వర్తించింది. రాజకీయాలు నాకు సెట్ కావని తెలిసింది.. అందుకే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ కలుస్తాను.. అశ్వనీదత్ గారిని కూడా క్షమించమని కోరుతున్నా. అలాగే మా గురూజీ రాఘవేంద్రరావు గారు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గారు అంతా.. మార్పు చెందిన నేను ఒక్క అడుగు వేస్తే మీరు వంద అడుగులు ముందుకు నడిపించాలని కోరుతున్నా’ అంటూ పశ్చాత్తాపపడుతూ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పృథ్వీరాజ్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.