ప్రస్తుతం విడుదలైన సినిమాల ఫలితాలను పరిశీలిస్తే.. ఓ విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రేక్షకుడు పాత చింతకాయ పచ్చడి లాంటి కథలను ఆదరించడం లే. ఒకవేళ కథ పాతదే అయినా.. దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో అయినా కొత్తదనం ఉండాలి. ఇవేం లేకుండా కేవలం హీరో, దర్శకుల బ్రాండ్‌ను నమ్ముకుని సినిమా తీస్తే.. ప్రేక్షకులు నిర్దయగా నో చెప్తున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే ఆకాశానికెత్తుతున్నారు.
తాజాగా విడుదలైన సినిమా ఫలితాలతో ఈ విషయం స్పష్టం అయ్యింది. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా తెలిపారు. కంటెంట్ బాగుంటే.. ఎలాంటి అడ్డంకులు కూడా సినిమా విజయాన్ని అడ్డుకోవని వెల్లడించారు. బుధవారం ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ఓ కథను అనుకున్నప్పుడు, నిర్మాతలు కథ వినే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కథల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించండి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కష్టకాలం నడుస్తోంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుడు థియేటర్స్‌కు వెళ్లకూడదని అస్సలు అనుకోవడం లేదు. పైగా ఓటీటీలో ఎక్స్‌ట్రాగా సినిమాలు చూసుకుంటున్నారు.’’ అన్నారు
‘‘కాకపోతే.. మనం ప్రేక్షకుడిని కట్టిపడేసే విధమైన కథతో సినిమాలు తీయాలి. ఇందుకు తాజాగా వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలే ఉదాహరణ. ఈ చిత్రాలన్ని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. వారిని థియేటర్స్ కూర్చోబెట్టాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వస్తారు. అంతే కానీ.. . ప్రేక్షకులు ఇంట్లో కూర్చోని చూడటానికి అలవాటు పడిపోయారనే మనమేం బాధపడనక్కర్లేదు. ఇవన్నీ నాకు ఉన్నాయి. నా సినిమా అయినా సరే.. ప్రేక్షకులకు నచ్చితేనే.. థియేటర్స్‌కు వచ్చి చూస్తారు’’ అని తెలిపారు
‘‘మంచి సినిమాను తీస్తే.. ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారనటంలో నాకెలాంటి డౌటు లేదు. వాళ్లకి నచ్చకపోతే సినిమా రెండో రోజే పోతుంది. అందులో నేను కూడా ఓ బాధితుడినే. కాబట్టి కంటెంటే ముఖ్యం. డైరెక్టర్స్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. సినిమా పరిశ్రమను ముందుకు నడిపించాల్సిన వ్యక్తులు వాళ్లే. దర్శకులు నిరంతరం ఎందుకు సినిమా హిట్ అయ్యింది.. ఎందుకు ప్లాప్ అయ్యిందని ఆలోచిస్తుండాలి. రీసెర్చ్ చేస్తుండాలి’’ అని సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.