రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు వర్కవుట్ కాలేదన్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనలా కాదని అన్నారు. జనం ఆశీస్సులతో పవన్ అత్యున్నత స్థానంలోకి వెళతాడని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎన్‌ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ నేను ఏదైనా ఒకటి తలిస్తే దాని అంతు చూడటం అనేది నాకు అలవాటైంది.
నా మనసులోంచి రాకపోతే.. నేను దాని అంతుచూడలేను. అలా నేను అంతుచూడలేకపోయింది ఏంటో మీకు తెలుసు. మళ్లీ వెనక్కు వచ్చేశాను. అక్కడ రానించటం చాలా కష్టం. అక్కడ సున్నితంగా ఉండకూడదు. అక్కడ బాగా మొరటు తేలాలి. రాటు తేలాలి. అన్నా.. అనకపోయినా మాటలు అనాలి.. అనిపించుకోవాలి. అవసరమా ఇది.. పవన్ ఇందుకు బాగా తగిన వాడు. తను అంటాడు.. అనిపించుకుంటాడు. అలాంటి వారికి మీరందరూ ఉన్నారు. అందరి సహాయ, సహకారాలు ఆశ్సీసుల తోటి కచ్చితంగా.. ఏదో ఒకరోజు పవన్‌ని అత్యున్నత స్థానంలో చూస్తాం’’ అని అన్నారు.
గతంలో గాడ్ ఫాదర్ ఈవెంట్‌లోనూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. ‘‘ నా తమ్ముడి నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటినుంచి నాకు తెలుసు. అందులో ఎక్కడా కూడా కలుషితం అవ్వలేదు. రాజకీయాల్లోకి అలాంటి వాళ్లు రావాలన్నది నా ఆకాంక్ష. దానికి కచ్చితంగా నా సపోర్టు ఉంటుంది. నేను ఒక పక్కన, తను ఒక పక్కన ఉండటం కంటే.. నేను రాజకీయాల్లోంచి వెనక్కు వచ్చేటం మంచిదని భావిస్తున్నా. తను భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతాడు. ఏమో.. ఏలే అవకాశాన్ని ప్రజలు తనకు ఇస్తారని భావిస్తున్నాను’’ అని అన్నారు.