మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ కాంబినేషన్ లో.. మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న “వాల్తేరు వీరయ్య” మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వాల్తేరు వీరయ్యకి సంబధించి వెబ్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనుభవాలను, విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న:
తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలను ధాటి పోతోంది. ఈ పిరియడ్‌ని మీరు తెలుగు సినిమాకి స్వర్ణయుగంగా భావిస్తున్నారా?
మెగాస్టార్ సమాధానం:
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు-నాటు పాటకి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చినట్టే గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ విషయంలో రాజమౌళికి, కీరవాణికి, చంద్రబోస్, తారక్- రామ్ చరణ్‌కి నా అభినందనలు. అసలు మన టాలీవుడ్ మొదలైన రోజుల్లోనే కేవి.రెడ్డి, హెచ్.ఎమ్. రెడ్డి లాంటి దిగ్దర్శకులతో ప్రాంభమైంది. కాబట్టి.. అప్పుడే మనకి స్వర్ణయుగం మొదలైనట్టు. ఇప్పుడు అది మరింత ఉచ్చ స్థాయికి వెళ్లినందుకు ఆనందంగా ఉంది.
ప్రశ్న:
వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో మీ వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. సినిమా చేస్తున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?
సమాధానం:
నిజానికి నాకు వ్యక్తిగతంగా ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువ ఇష్టం. గతంలో అలాంటి ప్రయత్నాలు కూడా కొన్ని చేశాను. కానీ.., అభిమానులు నా నుండి కమర్షియల్ సినిమాలు కోరుకుంటారు. నేను అవి చేస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఆనందంగా ఉంటారు. కాబట్టే.. నేను కమర్షియల్ సినిమాల వైపే ఉంటాను. వాల్తేరు వీరయ్య కూడా అన్నీ ఎమోషన్స్‌తో నిండి ఉండే అలాంటి కమర్షియల్ సినిమానే. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నాకు అన్నయ్య, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి వైబ్స్ అనిపించాయి. షూటింగ్ పూర్తి అయినా.. ఆ ఫీల్ కోసమే సెట్‌లో ఉండిపోయే వాడిని. ఈ విషయంలో దర్శకుడు బాబీని కచ్చితంగా అభిందించాలి.
ప్రశ్న :
కమర్షియల్ సినిమాల్లో కూడా న్యూ ట్రెండ్ మూవీస్ వస్తున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ లైక్.. “విక్రమ్, ఖైదీ, KGF” లాంటివి. మిమ్మల్ని విక్రమ్ లాంటి మూవీలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సమాధానం:
అలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ఫిజికల్‌గా కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ.., చిరంజీవి సినిమా అంటే పాటలు, ఫైట్స్ లేకుండా అభిమానులు ఊహించలేరు. వారి కోసమే నా కష్టం అంతా. అయితే.. అలాంటి కథలు వచ్చి, నాకు సరిపోతాయి అనిపిస్తే తప్పకుండా చేస్తాను
ప్రశ్న:
బాబీ యంగ్ స్టర్స్ మీ సినిమాలకి డైరెక్షన్ చేస్తున్న సమయంలో వారికి ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది? వారు మీకు కరెక్షన్స్ చెప్పగలిగే అంత స్పేస్, ఫ్రీడమ్ ఎలా కల్పిస్తారు?
సమాధానం:
చాలా మందికి తెలియని అంశం ఒకటి ఉంది. షాట్ అయ్యాక నేను ఎప్పుడూ మోనిటర్‌లో చూసుకోను. దర్శకుడు తృప్తి చెంది ఓకే చెప్పే వరకు ఆ షాట్ చేస్తూనే ఉంటాను. కథ చెప్పే దర్శకుడిని మెప్పిస్తేనే.. అభిమానులను మెప్పించగలను అని నమ్ముతా. కాబట్టే నా దర్శకులకు ఆ ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుంది.
ప్రశ్న:
బాబీ మీకు ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ముందుగా రవితేజ ఫైనల్ కాలేదు కదా? తరువాత అయన ఎలా యాడ్ ఆన్ అయ్యారు?
సమాధానం:
బాబీ కథ చెప్పినప్పుడు అందులోని ఎమోషన్ నాకు నచ్చి కథని ఓకే చేశా. అయితే.. ఆ ప్రధాన పాత్రలో ఎవరిని తీసుకున్నాము అన్నపుడు నా తమ్ముడు లాంటి రవితేజ పేరు చెప్పగానే ఓకే అనేశాను. రవితేజ ఈ కథని ఇంకాస్త ఎన్ హ్యాన్స్ చేస్తాడని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకాన్ని రవితేజ పూర్తిగా నిజం చేశాడు.
ప్రశ్న:
23 ఏళ్ళ క్రితం రవితేజ మీ తమ్ముడిగా అన్నయ్య సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్ళీ వీరయ్యలో ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఆయనలో వచ్చిన మార్పు ఏమిటి?
సమాధానం:
ఈ 23 ఏళ్ళలో రవితేజలో ఎలాంటి మార్పు రాలేదు. తాను స్టార్ అయ్యాను అన్న ఫీలింగ్ ఎక్కడా చూపించదు. కథకి ఏమి కావాలో అదే ఆలోచిస్తాడు. అప్పుడు సినిమా కోసం ఎంత కష్టపడేవాడో.. ఇప్పుడు కూడా అంతే డెడికేషన్ చూపించాడు. ఇంకా చెప్పాలంటే.. అప్పటికీ, ఇప్పటికీ రవితేజ డైట్ కూడా మారలేదు.
ప్రశ్న:
ఇన్నేళ్ల కెరీర్ తరువాత కూడా.. ఇంకా ఇంత కష్టపడుతున్నారు. మీలో కసిని పెంచుతున్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి?
సమాధానం:
నా అభిమానుల ఆదరణ. వారు ఆదరిస్తున్నారు కాబట్టి ఎంత కష్టమైన పడాలన్న కసి నాలో ఉంది. ఇక్కడ మీకు ఓ ఉదాహరణ కూడా చెప్పాలి. బావగారు బాగున్నారా సమయంలో భంగీ జంప్ చేశాను. అన్ని అడుగుల ఎత్తు నుండి దూకడం ముందుగా భయంగానే అనిపించింది. కానీ.., ఈ షాట్‌కి ధియేటర్‌లో ప్రేక్షకులు ఆనందిస్తారు కదా అన్న ఆలోచనే నా చేత ధైర్యంగా ఆ ఫీట్ చేపించింది. కాబట్టి.. అభిమానుల ఆదరణే నా డ్రైవింగ్ ఫోర్స్.
ప్రశ్న:
సినిమా చేస్తున్న సమయంలో బాబీని మీ అభిమానిలా ట్రీట్ చేశారా? లేక దర్శకుడిగానే ట్రీట్ చేశారా?
సమాధానం:
బాబీ నా అభిమాని అయినంత మాత్రాన నేను అవకాశం ఇవ్వలేదు. ఓ మంచి కథతో అప్రోచ్ అయ్యాడు. అంతకుమించి రోజూ కష్టపడ్డాడు. బాబీ తండ్రిగారు ఈ మూవీ షూటింగ్ దశలోనే చనిపోయారు. అంతటి బాధని కూడా దిగమింగుకుని 3 రోజే బాబీ షూటింగ్‌కి వచ్చేశాడు. పని చేస్తేనే కాస్త ప్రశాంతంగా ఉంటాను సర్ అని చెప్పాడు. ఇంత కష్టపడే వ్యక్తి నా అభిమానిగా ఉండటం చాలా గర్వపడేలా చేసింది. అందుకే నేను కూడా బాబీకి అభిమానిగా మారిపోయాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను.
ప్రశ్న:
స్క్రీన్ పై మీది, శృతిహాసన్‌ది జోడీ కలర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఆమెతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?
సమాధానం:
శృతిహాసన్ నా మిత్రుడు కమల్ హాసన్ కూతురు. సినిమా, నటన, డ్యాన్స్ ఇలాంటివి అన్నీ వాళ్ళ DNA లోనే ఉంటాయి. ఆమె ఈ సినిమా కోసం అద్భుతంగా పని చేసింది. అంత చలిలో కూడా ఆమె డ్యాన్స్ చేసిన విధానం అద్భుతం. ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. కానీ.., అప్పటికే సమయం లేక ఆ షూట్ చేసేయాల్సి వచ్చింది.
ప్రశ్న:
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల గురించి, వారి సినిమా అభిరుచి గురించి ఏమి చెప్తారు?
సమాధానం:
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల గురించి, వారికి సినిమాపై ఉన్న ఫ్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మూవీ నిర్మాణం విషయంలో వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నేను చాలా విషయాల్లో ఖర్చు తగ్గించుకోమని వాళ్ళకి సజెస్ట్ చేస్తూ వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా కోసం అడిషనల్ లెంత్ అస్సలు షూట్ చేయలేదు. కేవలం 10 నిమిషాల సీన్స్ తొలగించి ఫైనల్ కాపీ సిద్ధం చేశాము.
ప్రశ్న:
మీ సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ ముందు నుండి లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఈ సినిమాలో అయన చాలా ప్రయోగాలు చేసినట్టు ఉన్నారు?
సమాధానం:
దేవి శ్రీ ప్రసాద్ అంతే ఆ హోరు, జోరు ఉంటుంది. చాలా విచిత్రంగా ట్యూన్స్ సిద్ధం చేస్తాడు. ఇక ఈ సినిమాలో పాటలకి కొన్ని లిరిక్స్ కూడా దేవి అందించాడు. అవి కంపోజింగ్ సమయంలో రఫ్‌గా అలా పెట్టినా.. చివరికి అవే బాగున్నాయి అనిపించేలా మాయ చేస్తాడు దేవి.
ప్రశ్న:
ఈ మధ్య కాలంలో మీలో మంచితనం మరీ ఎక్కువ అయ్యింది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు! మరీ అంత మంచితనం అవసరమా?
సమాధానం:
అవసరమే. నన్ను ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడితే వెంటనే ఓ మాట అనేయడం చాలా సులభం. కానీ.., దాని వల్ల సినిమా నష్టపోతే మనం సాధించేది ఏమిటి? అంతిమంగా సినిమా బాగుండాలి. నిర్మాత బాగుండాలి. ఈ ఇగోలు, కోపాలు అన్నిటిని దాటి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ఓర్పు వహించడం చాలా కష్టం. అయినా.. తప్పదు.
ప్రశ్న :
పండగకి వస్తున్న రెండు సినిమాలు ఓకే నిర్మాణ సంస్థ నుండి వస్తున్నాయి కదా? మీరు, బాలకృష్ణ కలిసి ఓ ప్రమోషనల్ ఈవెంట్ ఆర్ ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసే అవకాశం ఉందా?
సమాధానం:
ఇది కాస్త అసాధ్యమైన పనే. కానీ.., చెప్పలేము ఏమైనా జరగొచ్చు. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసే మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇదంతా ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న:
ఇండస్ట్రీ పెద్ద అన్న ట్యాగ్‌కి ఎందుకు దూరంగా జరుగుతున్నారు?
సమాధానం:
అది అంత విలువైంది అని నేను భావించడం లేదు. కానీ.., ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా.. ఎంత వరకైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను పరిశ్రమకి భుజం సహయం చేస్తాను గాని.. భుజకీర్తలు ఆశించను.