గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్స్ ఆగిపోయాయి, థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ షూటింగ్స్ ఆరంభం అయ్యాయి.. థియేటర్లు, మాల్స్ ఓపెన్ అయ్యాయి. కరోనా కారణంగా కొంత మంది సెలబ్రెటీలు తమ పెళ్లిళ్ళు వాయిదాలు వేసుకున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో త్వరలోనే బాలీవుడ్ జంటలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్‌కుమార్ రావ్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్త్రీ, లూడో, న్యూటన్, రాబ్తా తదితర చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. తన స్నేహితురాలైన పత్రలేఖను పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చంఢీగఢ్‌లో నవంబర్ 13వ తేదీన వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. జైపూర్ లో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకుంటున్నారని, ఇప్పటికే ముఖ్యలందరికీ ఆహ్వానాలు వెళ్లాయని సమాచారం.
2014లో హన్సల్ మెహతా రూపొందించిన సిటీలైట్స్ లో కలిసి జంటగా నటించారు. అప్పట్నుంచి వీరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రలేఖ పుట్టిన రోజు సందర్భంగా రాజ్ కుమార్ రావు తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇలా వీరి మధ్య పుట్టిన ప్రేమకు ఈ నెలలో జరిగే పెళ్లితో శుభం కార్డు పడబోతోంది. బాలీవుడ్‌కు చెందిన అత్యంత సన్నిహితులను మాత్రమే వీరి వివాహానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌రావ్ తనకు కాబోయే భార్యకు స్పెషల్ వెడ్డింగ్ గిఫ్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం.