తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అని చాలామంది కంటెస్టెంట్స్ సెలబ్రిటీలుగా ఎదుగుతున్నారు. బిగ్ బాస్ తర్వాత బయట ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. అలా ఇటీవలే బిగ్ బాస్ 5వ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు లోబో. ఇలాంటి తరుణంలో అనుకోకుండా ఓ సినిమా ఆఫర్ రావడంతో పట్టలేని సంతోషంలో ఉన్నాడు లోబో. ఇంతకీ అంతపెద్ద ఆఫర్ ఏమయ్యుంటుందనే సందేహం కలగవచ్చు. ఆ విషయాన్ని కూడా స్వయంగా బయటపెట్టాడు లోబో.
లోబో మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ‘భోళా శంకర్’లో అవకాశం కొట్టేసాడు. ఈ అవకాశం కూడా మెగాస్టార్ పిలిచి మరీ ఇవ్వడం అనేది నమ్మలేకపోతున్నాడు. అవును.. నిజంగానే లోబో భోళాశంకర్ చిత్రంలో అవకాశం అందుకున్నాడు. అలాగే మెగాస్టార్ పక్కన నటించే అవకాశం రావడమంటే డ్రీం కం ట్రూ.. అయిందని రీసెంట్ గా ఓ లైవ్ లో చెప్పుకొచ్చాడు లోబో. కానీ తన పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే విషయాలు బయటపెట్టలేదు. కానీ చిత్రంలో మెగాస్టార్ పక్కనే ఉండే ముఖ్యమైన క్యారెక్టర్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం మెగాస్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం అనంతరం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళాశంకర్, డైరెక్టర్ బాబీతో ఓ చిత్రం లైన్ చేసాడు. ఐతే భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసింది చిత్రబృందం. తమిళ సూపర్ హిట్ వేదాళం చిత్రానికి రీమేక్ గా రూపొందుతుండగా.. మెహర్ రమేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ కాగా కీర్తిసురేష్ కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.