సినిమా అంటే రంగుల ప్రపంచం అని అందరికీ తెలిసిందే. ఇక్కడ మంచివాళ్లు ఉంటారు.. మంచివాళ్లలా నటిస్తూ ముంచే వాళ్లు కూడా ఉంటారు. ఈ మాటలు మనం చెప్పేవి కావు. చాలా సందర్భాల్లో స్వయంగా స్టార్లు చెప్పినవే. పైగా గత కొన్నేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే వివాదం కూడా తరచూ వినిపిస్తూనే ఉంది. అవకాశాలు ఇప్పిస్తామంటూ మమ్మల్ని వాడుకోవాలని చూశారని కొందరు, తప్పుగా ప్రవర్తించారని మరికొందరు, అవకాశాల కోసం సర్వం కోల్పోయామని ఇంకొందరు వ్యాఖ్యలు చేయడం చూశాం. గతంలో అయితే హీరోయిన్లు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య హీరోలు కూడా ఇలాంటి మాటలు చెప్పడం కాస్త విస్మయానికి గురిచేస్తున్న అంశం. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బిగ్ బాస్ నటుడు అంకిత్ కూడా చేరాడు.
ఉదారియన్ సీరియల్ తో పాపులర్ అయిన అంకిత్ గుప్తా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 16లో పాల్గొన్న విషయం తెలిసిందే. అతను ఇటీవలే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత అంకిత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అంకిత్ గుప్తా అతను ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చాడు. స్టార్ కావాలంటే కమిట్మెంట్ అడిగారంటూ అంకిత్ చెప్పడం ఇప్పుడు అటు బుల్లితెరలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
అంకిత్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక వ్యక్తి నేరుగా కాంప్రమైజ్ అవుతావా? అని ప్రశ్నించాడు. కాసేపు నాకు ఏం అర్థం కాలేదు. ఇండస్ట్రీలో కొన్ని పద్ధతులు, విధానాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. కొందరు పెద్ద పెద్ద తారల పేర్లు చెప్పి.. వాళ్లంతా అలా స్టార్లు అయినవాళ్లేనని చెప్పాడు. ఆ స్థాయికి రావడానికి ఎన్నో త్యాగాలు చేశారన్నాడు. అలాంటి పనులు నా వల్ల కాదని చెప్పాను. మాట్లాడుతూనే నన్ను అసభ్యంగా తాకేందుకు చూశాడు. నేను అతడి నుంచి తప్పించుకున్నాను. నా లైఫ్ లోనే చాలా చెత్త అనుభవమది” అంటూ అంకిత్ గుప్తా వాపోయాడు. ప్రస్తుతం అంకిత్ గుప్తా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ నుంచి రాగానే అంకిత్ మరో షోలో అవకాశం దక్కించుకున్నట్లు చెబుతున్నారు.