బలగం సినిమాలో నటించిన వారికి, పాటలు పాడిన వారికి మంచి పాపులారిటీ వచ్చింది. అలాంటి వారిలో పస్తం మొగిలయ్య ఒకరు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బలగం సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన అతి కొద్ది సినిమాల్లో బలగం మొదటి వరుసలో ఉంటుంది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా పాటలు మంచి విజయాన్ని సాధించాయి. పాటలు పాడిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పస్తం మొగిలయ్య ఒకరు. ఇక, మొగిలయ్య ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ఆయన అభిమానులను కలతకు గురి చేస్తోంది. మొగిలయ్య గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు మరో అనారోగ్యం ఆయన్ని చుట్టుముట్టింది. మొగిలయ్య గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మొగిలయ్యకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మొగిలయ్య కుటుంబం అల్లాడిపోతోంది. మందులు కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతోంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ వేడుకుంటున్నారు. మొగిలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.