బాలీవుడ్ లో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు. అయితే ఈ కేసులో ఆర్యన్ తో పాటు,.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్‌సీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు లో ఆర్యన్ ఖాన్ ఉన్నారు. పోలీసులు ఖైది నెంబర్ 956 గా కేటాయించారు. కాగా, అరెస్ట్ అయిన 12 రోజుల తర్వాత తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు ఆర్యన్ ఖాన్‌కు జైలు అధికారులు అనుమతించారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడటం గమనార్హం. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తో ఆర్యన్ ఖాన్ మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చినట్లు జైలు అధికారులు తెలుపుతున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆర్యన్ ని కామన్ సెల్‌కి పంపించామన్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ ఫిటిషన్ ఈ నెల 20కి వాయిదా పడింది. అప్పటివరకు అతను ముంబైలోని జైల్లోనే ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆర్యన్ ఖాన్ కి ఇంటి నుంచి రూ. 4,500మనీ ఆర్డర్ వచ్చింది. వీటిని క్యాంటిన్ ఖర్చులుగా ఆర్యన్ వాడుకోనున్నాడు. జైలు రూల్స్ ప్రకారం.. అరెస్టయి జైల్లో ఉన్నవారికి రూ.4500 మాత్రమే గరిష్ఠంగా ఇచ్చేందుకు అనుమతిస్తారు. జైలు క్యాంటిన్లో చిరుతిండ్లు, జ్యూస్ సహా ఇతర ఆహార పదార్థాలను కొనుక్కునేందుకు ఆర్యన్ వీటిని వినియోగించుకోవచ్చు. ఇంటి భోజనం వద్దని జైలు ఆహారాన్నే ఆర్యన్ స్వీకరిస్తున్నాడు. ఖైదీలు వారానికి ఒకసారి వారి కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది.