బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ మద్యనే తన 80వ పుట్టిన రోజులు తనకు ఎంతో ఇష్టమైన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ సెట్స్ లో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా వెండితెర, బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన బ్రహ్మాస్త్ర, గుడ్ బై చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. అమితాబ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని.. ఆ ప్రమాదంలో తనకు రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని తన బ్లాగ్ లో అభిమానుకు తెలిపారు.
ప్రస్తుతం అబితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ -14 లో కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఇనుప ముక్క తన కాలికి గట్టిగా తగలడంతో తీవ్రంగా రక్తస్రావమైందని, వెంటనే తనను హాస్పిటల్ కి తరలించగా డాక్టర్లు గాయపడ్డ చోట కుట్లు వేశారని అన్నారు. ప్రస్తుతం తాను యాంటిసెప్టిక్ మందులు వాడుతున్నానని.. డాక్టర్లు తనను ఎట్టి పరిస్థితిలో షూటింగ్ లో పాల్గొనవద్దని సలహా ఇచ్చారట. అంతేకాదు కొన్ని రోజులు పాటు కాలిపై ఎలాంటి వత్తిడి తీసుకు రావొద్దని తెలిపారట.
తన కాలికి గాయమైనా.. డాక్టర్లు తనని నడవకూడదు అన్నా.. కేబీసీ షూటింగ్ లో పాల్గొన్నానని.. తన వల్ల ప్రోగ్రామ్ కి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతోనే ధైర్యం చేసినట్లు తెలిపారు అమితాబ్. తమ అభిమాన నటుడు అమితాబ్ కి గాయం అయిన విషయం తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఉంచాయి చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ – కే లో ఒక ముఖ్యపాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు సమాచారం.