ప్రముఖ కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్న సందర్భంగా పెళ్లి పత్రికలను అందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే కమెడియన్ అలీ, జుబేదా అలీ దంపతుల కుమార్తె ఫాతిమా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అలీ కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సహనటుడు బ్రహ్మానందం, సాయి కుమార్ సహా పలువురు సినీ పెద్దలు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇక పెళ్లి తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించేందుకు అలీ ప్రముఖులను కలుస్తున్నారు.
ఈ క్రమంలోనే నవంబర్ 2న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. తన కుమార్తె పెళ్ళికి ఆహ్వానించారు. తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి.. కుమార్తె పెళ్లి తొలి ఆహ్వాన పత్రికను జగన్ ముఖ్యమంత్రికి అందజేశారు. తప్పకుండా తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా తన కూతురు వివాహానికి ఆహ్వానించారు. అలీ, ఆయన సతీమణి జుబేదా అలీ సతీసమేతంగా మెగాస్టార్ ని కలిసి పెళ్లి పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అలీతో కలిసి దిగిన ఫోటోను అలీ సతీమణి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.