అందరిదీ ఒకరూటు.. తాను మాత్రం సెపరేటు అంటాడు అక్షయ్ కుమార్. కోవిడ్ సీజన్ లోనూ సినిమాల స్పీడును ఏమాత్రం తగ్గించలేదు ఈ బాలీవుడ్ స్టార్. ఇప్పటికే మూడు సినిమాలను పూర్తిచేసి.. నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచిన అక్షయ్ కిట్టీలో మరో మూవీ చేరింది. దీంతో.., మళ్ళీ బాలీవుడ్ నెంబర్ గేమ్ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరంటే అక్షయ్ కుమార్ పేరే చెప్పాలి. ఖాన్ త్రయంను సైతం పక్కకు నెట్టి.. హిందీ చిత్రసీమలో అగ్రపథాన దూసుకుపోతున్నాడు అక్షయ్. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలను ఈజీగా ఆడియెన్స్ ముందు నిలిపే ఈ సీనియర్ హీరో కిట్టీలో ప్రస్తుతం ఏడు సినిమాలున్నాయి. ఒక స్టార్ హీరో ఒకేసారి 7 సినిమాని లైన్ లో పెట్టడం అంటే మాటలు కాదు.
అక్షయ్ సినిమాల స్పీడుకి సీజన్ అన్ సీజన్ తో ఎలాంటి సంబంధం లేదు. కోవిడ్ సమయంలో కూడా ఈ ఖిలాడి దూకుడు ఓ రేంజులో కొనసాగింది. కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ.. మిగతా బాలీవుడ్ స్టార్స్ కంటే ముందే షూటింగ్స్ లో జాయిన్ అయ్యాడు అక్షయ్ కుమార్. టోటల్ గా ఏడు సినిమాలతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్.. వీటిలో ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’, ‘అత్రంగి రే’ సినిమాల షూటింగ్స్ పూర్తిచేసి విడుదలకు ముస్తాబు చేశాడు. ఇక.. ‘పృథ్వీరాజ్’, ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్.. లేటెస్ట్ గా ‘సూరరై పొట్రు’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది బీటౌన్ టాక్. సూర్య కథానాయకుడిగా నటించిన ‘సూరరై పొట్రు’ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాని.. ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హిందీలో నిర్మించబోతున్నట్టు ప్రకటించాడు. ఇక.. హిందీ వెర్షన్ లో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్నాడట. త్వరలోనే.. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ నటించే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయట. మొత్తంమీద.. అప్ కమింగ్ మూవీస్ తో ఈ ఇంటర్నేషనల్ ఖిలాడి బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో దున్నేస్తాడో చూడాలి.